తెలుగు ఇండస్ట్రీలో దర్శకేంద్రులు రాఘవేంద్రరావుకి మౌనమునిగా పేరుంది. గతంలో సినిమా ఫంక్షన్స్‌కి వచ్చి మౌనంగా ఆశీర్వదించి వెళ్లే ఆయన… మీడియా మొఘుల్ రామోజీరావుగారి ఛానల్ ఈటీవీలో ప్రసారమయ్యే ‘సౌందర్యలహరి’, ‘సై సై సయ్యారే’ పుణ్యమా అంటూ మౌనం వీడారు. తరవాత నుంచి సినిమా ఫంక్షన్స్‌లోనూ మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రారంభమైన ‘యన్.టి.ఆర్’ బయోపిక్ ప్రారంభ వేడుకలో మాట్లాడిన రాఘవేంద్రుడు బాలకృష్ణ ముందు ఒక కర్చీఫ్ వేశారు. రామారావుగా నటిస్తున్న బాలయ్యను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇవ్వమని అడిగారు. సినిమాకు తేజ దర్శకుడు కదా? అనుకోవచ్చు. అయితే… సినిమాలో ఎన్టీఆర్ నటించిన సినిమాల ప్రస్తావన వుంటుంది కదా. ఆ ప్రస్తావన వచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ చేసే దర్శకుడి పాత్రలో తెరపై నటుడిగా కనిపిస్తానని నోరు తెరిచి మరీ అడిగారు. ఒకటా రెండా ఎన్టీఆర్ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో కమర్షియల్ హిట్స్ చాలా వచ్చాయి. వాటి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన్ను చూపించేస్తే పోలా?