రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో జరిగిన అతి పెద్ద స్కాం వ్యవహారంలో.. సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇందులో.. ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రత్యక్ష ప్రమేయం స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రాహుల్ ఎన్ని ఆరోపణులు చేసినా.. ఆయనను తేలికగా తీసుకుంటున్నట్లు… నటించారు కానీ… ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే.. నేరుగా.. మోడీ చెప్పడం వల్లే… ఇండియన్ భాగస్వామిగా.. అనిల్ అంబానీ కంపెనీని ఎంపిక చేసుకోవాల్సి వచ్చిందని…స్పష్టంగా ప్రకటించడంతో.. కుడితిలో పడ్డ ఎలుకలా బిజేపీ పరిస్థితి తయారయింది. ఢిల్లీలో కుదిపేసేలా ఈ వ్యవహారం ఉంది. రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్రమోడీని “దొంగ” అని నేరుగా సంబోధించేశారు. దీంతో బీజేపీ గింజుకోవడం ప్రారంభించింది. ఇలా ఓ ప్రధానమంత్రి ఎవరూ అనలేదంటూ.. విమర్శలు ప్రారంభించింది కానీ.. ఇప్పుడు ప్రజల దృష్టిలో.. రాఫెల్ “దొంగ” ఎవరు..? అన్న అంశమే ఉంది కానీ.. మోడీని “దొంగ” అన్నారా లేరా అన్నది టాపిక్ కాదు.
ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలాండే ప్రకటనను కవర్ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా.. బీజేపీ రాజకీయంగా స్పందించింది. కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ .. అనిల్ అంబానీ కంపెనీని దస్సాల్ట్ ఏవియేషన్… తన భారత భాగస్వామిగా ఎంపిక చేసుకోవడంతో.. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఏమీ లేదని ప్రకటించుకుంది. పిల్లికి ఎలుక సాక్ష్యంలా.. ఫ్రాన్స్ నుంచి దస్సాల్ట్ ఏవియేషన్ సంస్థ నుంచి అలాంటి ప్రకటనే చేయించుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ రాజకీయంగా విచిత్రంగా స్పందించంది. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత .. అంతకు ముందు.. చివరి దశ చర్చల వరకూ వచ్చిన రాఫెల్ డీల్‌ను క్యాన్సిల్ చేసి.. కొత్త ఒప్పందం చేసుకుంది బీజేపీ. కానీ ఆ ఒప్పందం.. యూపీఏ అవినీతి వల్లే ఆగిపోయిందని.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. ముడుపులు అందకపోవడం వల్లే… ఆ ఒప్పందాన్ని యూపీఏ హయాంలో చేసుకోలేదని కొత్త కథ చెప్పుకొచ్చారు. దానికి సాక్ష్యాలుగా… రెండు కాగితాలు గాల్లో ఆడించి చూపించారు రవిశంకర్ ప్రసాద్.
రాఫెల్ డీల్ ను సమర్థించుకోడానికి బీజేపీకి ఎప్పుడ రెండు కాగితాలు ఉపయోగపడుతున్నాయి. అవిశ్వాసంపై సభలో చర్చ జరిగినప్పుడు.. రాహుల్ రాఫెల్‌పై తీవ్ర ఆరోపణలు చేస్తే.. చేతిలో ఉన్న రెండు పేపర్లు చూపిస్తూ.. నిర్మలా సీతారామన్.. రాహుల్ అంతా అబద్దం చెబుతున్నారని చెప్పుకొచ్చారు. అసలా పేపర్లేమిటో ఎవరికీ తెలియదు. ఆమె అబద్దాలు చెప్పారని… కాంగ్రెస్ ప్రివిలేజ్ నోటీసు కూడా ఇచ్చింది. ఇప్పుడు అలానే.. రవిశంకర్ ప్రసాద్.. అప్పట్లో ముడుపులు ఇవ్వలేదనే.. ఒప్పందం చేసుకోలేదని ఆరోపిస్తున్నారు. మొత్తానికి బీజేపీ.. తనకు ఎలాగూ .. బురద అంటింది కాబట్టి.. దాన్ని కాంగ్రెస్‌కు కూడా అంటిస్తే సరిపోతుదంని లెక్కలేసుకుంటున్నట్లుగా ఉంది. కానీ.. రాఫెల్ టేకాఫ్ అయిపోయింది… ఎక్కడో చోట ల్యాండ్ కావాల్సిందే..!