బిహార్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రయోగించిన ‘బీఫ్-మత అసహనం’ అస్త్రాలకు బీజేపీ ఎదురునిలవలేకపోయింది. బీజేపీ బలహీనతపై గురిచూసి సంధించిన అస్త్రం కనుకనే అది అంత గొప్పగా పనిచేసింది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీ ఆ రెండు ఆయుధాలను పక్కనపడేయడం అందరూ చూసారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మరో సరికొత్త వ్యూహంతో దూసుకువెళుతున్నట్లు కనిపిస్తోంది.
2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో మోడీ ప్రభంజనంలో బీజేపీ తిరుగులేని మెజార్టీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ అంతమాత్రాన్న బీజేపీని, నరేంద్ర మోడీని అందరూ అంగీకరిస్తున్నట్లు కాదు. దేశంలో నేటికీ అనేక కోట్ల మంది ప్రజలు, సంస్థలు, పార్టీలు బీజేపీని, నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అటువంటి వారినందరినీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షించాలని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రయత్నిస్తున్నట్లున్నారు.
దేశంలో మత అసహనం పెరిగిపోతోందని చెపుతూ అనేకమంది మేధావులు, కళాకారులు తమ అవార్డులను వాపసు ఇవ్వడం, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా స్టేట్మెంట్లు ఇవ్వడం, బిహార్ ఎన్నికలలో బీజేపీ ఘోర పరాజయం వంటివన్నీ కలిపి చూసినట్లయితే రాహుల్ గాంధి చేస్తున్న ఆ ప్రయత్నాలు కొంత వరకు ఫలించినట్లే చెప్పవచ్చును.
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో మోడీ చాలా దూకుడుగా వ్యవహరించినప్పటికీ, ఇప్పుడు ఆ దూకుడు కనిపించడం లేదు. అది అవసరం లేదు కూడా. కారణాలు ఎవయితేనేమి, ఎన్నికల సమయంలో ఆయన పట్ల దేశ ప్రజలలో కనబడిన విపరీతమయిన క్రేజ్ ఇప్పుడు కనిపించడం లేదు. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత ఏర్పడకపోయి ఉండవచ్చును అలాగని ఇదివరకు అంత సానుకూలత లేదని చెప్పక తప్పదు. దేశ ప్రజల కనిపిస్తున్న ఈ మార్పుని కాంగ్రెస్ పార్టీ బాగానే పసిగట్టినట్లుంది.
అందుకే బీజేపీ, నరేంద్ర మోడీ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కలిగిన వారినందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాలలో భాగంగానే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, జె.ఎన్.టి.యూనివర్సిటీలలో విద్యార్ధులకు మద్దతుగా వస్తున్న రాజకీయ పార్టీలతో చేతులు కలిపి మోడీ ప్రభుత్వంపై యుద్ధం చేస్తున్నారు. ఇదివరకు యూపీఏ కూటమి అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధి ఎన్నడూ ఈవిధంగా యూనివర్సిటీలకి వెళ్లి విద్యార్ధులకు సంఘీభావం ప్రకటించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎక్కడ బీజేపీ వ్యతిరేకత కనిపిస్తే అక్కడ రాహుల్ గాంధి వాలిపోయి హడావుడి చేస్తున్నారు.
జె.ఎన్.టి.యు. వ్యవహారంలో దేశ వ్యతిరేకతను పట్టించుకోకుండా దాని నుండి ఏవిధంగా రాజకీయ లబ్ది పొందాలని మాత్రమే రాహుల్ గాంధి ఆలోచిస్తున్నట్లుంది. దానికి ‘భావ వ్యక్తీకరణ స్వేచ్చ’ అనే అందమయిన ముసుగు తొడిగి, తన వాదనను సమర్ధించుకొంటున్నారు. ఈ వ్యవహారంలో వామపక్షాలు కూడా తలదూర్చడంతో వారితో కలిసి బీజేపీని, మోడీ ప్రభుత్వాన్ని డ్డీకొనే ప్రయత్నం చేస్తున్నట్లు కనబడుతోంది. త్వరలో మొదలయ్యే పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలో ఇది కళ్ళకు కట్టినట్లు కనిపించవచ్చును.