నాలుగు రాష్ట్రాలలో, ఒక కేంద్రపాలిత ప్రాంతమయిన పుదుచ్చేరిలో శాసనసభ ఎన్నికల హడావుడి మొదలయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు క్రమంగా ఎన్నికల ప్రచారాన్ని ఉదృతం చేస్తున్నాయి. ఆ ప్రచారంలో మళ్ళీ సామాన్య ప్రజలను ఆకట్టుకొనే విధంగా ప్రత్యర్ధి పార్టీలపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కనుక మళ్ళీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాకి చేతి నిండా పని..ప్రజలకి మంచి వినోదం ఉంటుంది. ఈ సందర్భంగా రాజకీయ పార్టీల తీరుతెన్నుల గురించి, తెర వెనుకున్న రాజకీయ సూత్రధారుల గురించి ప్రజలు తమ జనరల్ నాలెడ్జి (జికె)ని పెంచుకొనే అవకాశం కూడా ఉచితంగా లభిస్తుంది.
ఎన్నికలు జరుగబోతున్న అస్సోం రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడి కొన్ని రోజుల క్రితమే ఒక రౌండ్ ప్రచారం చేసి వెళ్ళినప్పుడు, ‘ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ నాశనం చేసిందనే’ గొప్ప విషయం ప్రజలకి చెప్పారు. ఆయన తరువాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి వంతు వచ్చింది. ఆయన నిన్న అస్సోంలోని దిగ్బోయ్ అనే ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ ప్రజల జికెని మరింత పెంచుకొనే నాలుగు ముక్కలు చెప్పారు.
బ్యాంకులకు 9,000 కోట్లు ఎగనామం పెట్టేసిన విజయ్ మాల్యా లండన్ పారిపోయే రెండు రోజుల ముందు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని కలిసి చాలా సేపు మాట్లాడారనే రహస్యాన్ని రాహుల్ గాంధి బయటపెట్టారు. విదేశాల నుంచి నల్లదనాన్ని వెనక్కి రప్పించి ఒక్కో భారతీయుడి బ్యాంక్ ఖాతాలో రూ.15 లక్షలు జమా చేసి చూపిస్తానని గొప్పలు చెప్పిన నరేంద్ర మోడీ ఆ పని ఇంతవరకు చేయలేనప్పటికీ, బ్యాంకులకి టోపీ పెట్టేసిన గుట్టు చప్పుడు కాకుండా దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యాని, ఐ.పి.ఎల్. మాజీ చీఫ్ లలిత్ మోడీని ఇంతవరకు ఎందుకు వెనక్కి రప్పించడం లేదు? అని ప్రశ్నించారు. విజయ్ మాల్యా లండన్ పారిపోయే ముందు అరుణ్ జైట్లీని ఎందుకు కలిసారు? వాళ్ళిద్దరూ ఏమి మాట్లాడుకొన్నారు? విజయ్ మాల్యా లండన్ పారిపోయే అవకాశం ఉందని తెలిసి ఉన్నప్పుడు అతనిని ఎందుకు అడ్డుకోలేదు? అని రాహుల్ గాంధి ప్రశ్నించారు. రాహుల్ గాంధి చెపుతున్న మాటలలో విజయ్ మాల్యా-జైట్లీ సమావేశం గురించి సామాన్య ప్రజలకు తెలియదు కనుక ఇప్పుడు అంతవరకు అందరూ ‘అప్ డేట్’ అయిపోవచ్చును. వాళ్ళిద్దరూ సమావేశమయ్యారనే సంగతి రాహుల్ గాంధికి కూడా ముందే తెలుసనేది కూడా అందరూ నోట్ చేసుకోవలసిన విషయమే. మిగిలిన ఈ నెలన్నర రోజుల్లో ఇటువంటి విషయాలు ఇంకా ఎన్ని నోట్ చేసుకోవాలో ఏమో?