పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకుంటానంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ భీష్మించుకుని కూర్చున్న సంగతి తెలిసిందే. ఆయన అసంతృప్తికి కారణం… ఎన్నికల సందర్భంగా కొంతమంది సీనియర్లు అనుసరించిన వైఖరి అనే అంటున్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ఇమేజ్ ను దెబ్బతీసే విధంగా కొంతమంది సీనియర్లు వ్యవహరించారనీ, ఎన్నికలను సీరియస్ గా తీసుకోకుండా… వారి వారసుల రాజకీయ భవిష్యత్తును మాత్రమే చూసుకున్నారనేది రాహుల్ అసంతృప్తిగా తెలుస్తోంది. ఇంతకీ… రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ఆ సీనియర్లు ఎవరంటే… చిదంబరం, కమలనాథ్, అశోక్ గెహ్లాట్!
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధించింది. కానీ, లోక్ సభ ఎన్నికలకు వచ్చేసరికి పరిస్థితి రివర్స్ అయిపోయింది. దీనికి కారణం కమలనాథ్, అశోక్ గెహ్లాట్ల నిర్లక్ష్య వైఖరి అనేది రాహుల్ ఆగ్రహంగా తెలుస్తోంది. ఈ ఇద్దరూ తమ వారసులకు టిక్కెట్లు ఇప్పటించుకోవడం కోసమే ఎక్కువ సమయం వృథా చేశారట! వీరి వారసులకు ఇప్పుడు టిక్కెట్లు ఇచ్చేది లేదని రాహుల్ స్పష్టం చేసినా… ఫర్వాలేదు, తాము దగ్గరుండి గెలిపించుకుంటామని ఈ ఇద్దరూ రాహుల్ తో చెప్పారు. దాంతో, కీలకమైన సమయంలో కేవలం వారసుల నియోజక వర్గాలకే పరిమితం అయిపోయి, రాష్ట్రాలో ఇతర ప్రాంతాల్లో ఈ ఇద్దరూ ప్రచారాన్ని చెయ్యలేదు అనేది రాహుల్ గాంధీ కోపంగా తెలుస్తోంది. ఎన్నికలు జరిగిన రోజున ఓటింగ్ సరళిని కూడా ఈ ఇద్దరూ పట్టించుకోలేదని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారట.
చిదంబరం విషయానికొస్తే… ఆయన కుమారుడు కార్తీ చిదంబరానికి సీటు వద్దు అని రాహుల్ గాంధీ మొదట్లో వ్యతిరేకించారు. అయినాసరే, ఇచ్చి తీరాలంటూ చిదంబరం పట్టుబట్టారు. ఆ సందర్భంలో దాదాపు ఓ పదిరోజులపాటు అదే చర్చ కాంగ్రెస్ లో జరిగింది. దీంతో, చిదంబరం కూడా తన కొడుకు రాజకీయ భవిష్యత్తు సెటిల్ చేయాలనే ఆలోచించారే తప్ప, పార్టీకి అవసరమైన సేవలు చేయలేదనేది రాహుల్ గాంధీ ఆరోపణగా తెలుస్తోంది. మొత్తంగా, ఈ ముగ్గురు సీనియర్లు పార్టీకి అత్యంత అవసరమైన సమయంలో కీలక పాత్ర పోషించలేదనీ, కేవలం వారి స్వార్థాన్ని చూసుకున్నారనేది రాహుల్ గాంధీ కోపంగా ఉన్నట్టు సమాచారం. ఈరోజు పార్టీకి ఈ పరిస్థితి కారణం సీనియర్ల వైఖరే అనేది ఆయన అభిప్రాయంగా తెలుస్తోంది. కమలనాథ్, అశోక్ గెహ్లాట్, చిదంబరం… ఈ ముగ్గురూ ఇప్పుడు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి.