క్రికెట్‌ని జెంటిల్మన్ గేమ్ గా అభివర్ణిస్తారు. కానీ ఆ జెంటిల్మెన్ గుణం చాలా కొద్దిమందికే ఉంటుంది. ఆ కొద్దిమందిలో ద్రావిడ్ ఒకడు. ఆటాగాడిగా భారతజట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాల్ని అందించాడు. కోచ్‌గా భారతజట్టుకు టీ20 వరల్డ్ కప్ సాధించాడు. కేవలం ఆట తీరుతోనే కాదు, వ్యక్తిత్వంతోనూ అభిమానుల్ని సంపాదించుకొన్నాడు. తన సింప్లిసిటీతో ఆకాశమంత ఎత్తులో నిలిచిన మరో సంఘటన ఇది.
ఇటీవల భారతజట్టు టీ 20 విజేతగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. ఈ అద్భుతమైన విజయంతో భారతజట్టు కోచ్‌గా ద్రావిడ్ ప్రయాణం ముగిసింది. ఈ సందర్భంగా జట్టు సభ్యులందరికీ బీసీసీఐ నజనారా ప్రకటించింది. 15 మంది జట్టు సభ్యులకు ఒకొక్కరికీ రూ.5 కోట్లు, రిజర్వ్ ఆటగాళ్లకు కోటి చొప్పున బోనస్ అందించింది. కోచ్, సపోర్టింగ్ స్టాఫ్‌కూ నగదు పురస్కారం ఇచ్చింది. ప్రధాన కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ కు రూ.5 కోట్లు, సహాయక కోచ్‌లకు రూ.2.5 కోట్లు ఇవ్వబోయింది. అయితే ఇక్కడే రాహుల్ బీసీసీఐ నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరించాడు. తనని ఒకలా, మిగిలిన వాళ్లను మరోలా చూడొద్దని, బోనస్ కూడా అందరికీ సమానంగా ఇవ్వమని, సపోర్టింగ్ స్టాఫ్‌కి రూ.2.5 కోట్లు ఇచ్చే పక్షంలో తనకూ అంతే ఇవ్వాలని బీసీసీఐని కోరాడు. అంటే ద్రావిడ్ తనంతట తాను రూ.2.5 కోట్లు వద్దనుకొన్నాడన్నమాట. సపోర్టింగ్ స్టాఫ్ గురించి ఓ కోచ్ ఇంతలా ఆలోచించడం, భారీ నగదు బహుమతి వద్దనుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది.
ద్రావిడే ఇప్పుడే కాదు. ఇది వరకూ ఇలానే తన సింప్లిసిటీ చూపించాడు. గతంలో 2018లో భారత జట్టు అండర్ 19 ప్రపంచకప్ సాధించింది. ఆ జట్టుకు ద్రావిడ్ కోచ్ గా వ్యవహరించాడు. అప్పట్లో ఒక్కో ఆటగాడికి రూ.30 లక్షలు బోనస్ అందించింది బీసీసీఐ. కోచ్‌గా పని చేసిన ద్రావిడ్ కు రూ.50 లక్షలు, సహాయక సిబ్బందికి రూ.20 లక్షలు అందివ్వబోయింది. అయితే అప్పుడు కూడా ఇలానే ”నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. అందరినీ ఒకేలా గౌరవించండి” అని బీసీసీఐని ద్రావిడ్ కోరాడు. దాంతో బోర్డు దిగి వచ్చింది. సహాయక సిబ్బందికి రూ.25 లక్షల బోనస్ ప్రకటించింది. ద్రావిడ్ కూడా అంతే అందుకొన్నాడు.