అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైన దగ్గర్నుంచి… రాహుల్ కు కాలం కలిసొస్తున్నట్టుగా ఉంది. ఆయన 16వ తేదీన పగ్గాలు చేపడితే… ఈ నెల17న పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ఘన విజయం సాధించింది. అక్కడ విపక్ష అకాలీదళ్, బీజేపీ మట్టికరిచాయి. మొత్తం 32కుగాను 29 పురపాలక సంఘాలు కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంది. ఇక అమృత్ సర్, జలంథర్, పాటియాలా వంటి నగర పాలకసంస్థల్లో రికార్డు స్థాయి విజయాన్నిదక్కించుకుంది.. రాష్ట్ర వ్యాప్తంగా 267 వార్డులను గెల్చుకుంంది. ఇక పుదుచ్చేరిలో జరిగిన స్థానికసంస్థల ఎన్నికల్లో కూడా హస్తం పార్టీ విజయం సాధించడం విశేషం.
మరోవైపు పంజాబ్ స్థానిక ఫలితాల అనంతరం.ఈనెల18న గుజరాత్ ఫలితాల్లో సైతం గణనీయమైన రీతిలోనే సీట్లు ‘చే’జిక్కాయి. గత 22 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపిని ఓటమి భయం వెంటాడేలా చేసింది.. కేవలం మరో 12 స్థానాలు గెలుచుకుని ఉంటే కాంగ్రెస్ అక్కడ అధికారాన్ని అందునేది. ఫలితాల అనంతరం కూడా పార్టీ లోటుపాట్లు, నైపుణ్యా ల గురించి సమగ్రంగా చర్చించడానికి, అధ్యయనం చేయడానికి గుజరాత్లో రాహుల్ మూడు రోజుల పాటు పర్యటించనుండడం విశ్లేషకుల ప్రశంసలు అందుకుంటోంది. ఇది రాహుల్ ఢిల్లీ కేంద్రంగా మాత్రమే పనిచేసే వ్యక్తి కాదని క్షేత్రస్థాయిలో జరుగుతోంది తెలుసుకోవాలనుకోవడం మంచి ఆలోచన అంటున్నారు.
మరోవైపు 3 దశాబ్దాలుగా అధికార పార్టీ ఓడిపోవడం ఆనవాయితీగా మారిన హిమాచల్లో ఓటమిని ఎవరూ అంత తీవ్రంగా పరిగణించడం లేదు. గుజరాత్ ఎన్నికలు రాహుల్ ను పోరాట యోధుడిగా నాయకుడిగా పరిచయం చేశాయి. ఎన్నికల సంగతి అలా ఉంచితే… 2జి స్కామ్, ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ స్కాం వంటివన్నీ కోర్టుల్లో వీగిపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి సానుకూల పరిణామాలే. వీటన్నింటి నేపధ్యంలో ప్రస్తుతం రాహుల్ టైమ్ నడుస్తోందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.
అయితే…. అప్పుడే అంత సంబరపడాల్సిన పనిలేదని విశ్లేషకులు అంటున్నారు. లోక్సభ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ఉందనగా, ప్రీఫైనల్లా 2018లో ఏకంగా 8 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరిలో త్రిపుర, మేఘాలయ, నాగాల్యాండ్, మేలో కర్ణాటక, ఏడాది చివరన రాజస్థాన్, మధ్య ప్రదేశ్,, చత్తీస్ ఘడ్, ఎన్నికలు జరగనున్నాయి. వీటిల్లో మేఘాలయ, కర్ణాటకలలో అధికారం కాపాడుకోవడంతో పాటు ఇతర రాష్ట్రాలలోనూ ప్రభావం చూపిస్తేనే రానున్నది రాహు కాలమా? రాహుల్ కాలమా అనేది తెలుస్తుందని అంటున్నారు.