సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జన సభకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. తమ హక్కుల్ని కాపాడుకోవడం కోసం నాడు ప్రజలు ఉద్యమించారనీ, నీళ్లు నిధుల కోసం ప్రజలు తెలంగాణ కోరుకున్నారని రాహుల్ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నాడు సోనియా గాంధీ అర్థం చేసుకుని రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత నాడు తెరాసకు మద్దతు పలికారనీ, కానీ నేడు వారి గురించి కేసీఆర్ సర్కారు పట్టించుకోవడం మానేసిందన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి కేసీఆర్ సర్కారు పాల్పడుతోందన్నారు. ఎక్కడా లేని విధంగా దాదాపు రూ. 350 కోట్ల ఖర్చుతో కేసీఆర్ గృహం నిర్మించారనీ, అందతా ప్రజాధనం కాదా అని ప్రశ్నించారు. తెరాస పాలనలో ఇంతవరకూ దాదాపు మూడువేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారనీ, సీఎం సొంత నియోజక వర్గంలోనే దాదాపు వందమంది రైతులు బలవన్మరణం పాలయ్యారని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక, రాష్ట్రంలో కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ విమర్శించారు! తెలంగాణలో ఒక కుటుంబం రాచరిక పాలన సాగిస్తోందన్నారు. ఆ ఒక్క కుటుంబం కోసమేనా తెలంగాణ ప్రజలు పోరాడింది..? ఆ నలుగురు కోసమేనా ప్రజలు తెరాసను ఎన్నుకున్నది అంటూ ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ వెంటనే స్పందించేశారు. కుటుంబ పాలన గురించి రాహుల్ గాంధీ మాట్లాడటం ఈ దశాబ్దపు అతిపెద్ద జోక్ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ ఫొటోలను తన ట్వీట్ లో జత చేశారు. కుటుంబ పాలన గురించి కాంగ్రెస్ వారు మాట్లాడటం ఏంటని కేటీఆర్ అన్నారు.
నిజానికి, కుటుంబ పాలన గురించి రాహుల్ మాట్లాడినా, కేటీఆర్ స్పందించినా… ఈ రెండూ జోకుల్లానే ఉంటాయి! జోగీ జోగీ గుద్దుకున్నట్టుగానే ఉంటాయి. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీకి కొన్నేళ్ల అనుభవం ఉంది కాబట్టి… ఓ మూడు నాలుగు తరాల నాయకుల పేర్లు చెప్పడానికి ఉన్నాయి. రేప్పొద్దున తెరాస చరిత్ర కూడా అలానే ఉండదనే గ్యారంటీ లేదు! కేటీఆర్ అంగీకరించకపోయినా… తెరాసలో కేసీఆర్ ఫ్యామిలీ ఎంత బలంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యమంత్రి ఇద్దరు బిడ్డల్లో ఒకరు ఎంపీ, ఒకరు రాష్ట్రమంత్రి. మరో బంధువు ఇంకో శాఖకు మంత్రి! కేసీఆర్ తరువాతి స్థానంలో కేటీఆర్ ను నిలబెట్టేందుకు పెంచుతున్న ప్రాధాన్యతను ప్రజలు గమనిస్తున్నారు. ఇటీవల కేసీఆర్ మంత్రులకు ఇచ్చిన ర్యాంకింగులే తీసుకుంటే… కేసీఆర్ తరువాతి స్థానం కేటీఆర్ కే దక్కింది! వీటన్నింటినీ ఎలా అర్థం చేసుకోవాలి..?
కాబట్టి.. వారసత్వ రాజకీయాలు అనేవి అనివార్యంగా మారిపోయాయి. దాని గురించి మాట్లాడకపోతే బెటర్. కాంగ్రెస్, తెరాస, టీడీపీ.. ఏ పార్టీలు చూసుకున్నా రెండో తరం కోసమే నాయకుల పాకులాట కనిపిస్తోంది. ఏపీలో నారా లోకేష్ ను ప్రమోట్ చేయడం కోసం సీఎం చంద్రబాబు ఎన్ని రకాలుగా పుష్ చేస్తున్నారో చూస్తున్నాం. ఆ మధ్య యూపీలో కుటుంబ రాజకీయాల రచ్చ చూశాం. అందుకే, వారసత్వ రాజకీయాలు, కుటుంబ పాలన గురించి ఎవరు మాట్లాడినా జోక్ గానే వినిపిస్తుంది. గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకోవడమే అవుతుంది.