విజయ్ మాల్యా… దేశం నుంచి పారిపోవడానికి.. ఆయనపై జారీ అయిన లుకౌట్ నోటీసులో మార్పు చేయడమే కారణం. ఈ విషయం ఆలస్యంగా బయటకు వచ్చినా.. సీబీఐ నిజమేనని అంగీకరించక తప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ… మరో కొత్త విషయాన్ని బయటపెట్టారు. ఆ లుకౌట్ నోటీసులో మార్పులు చేసింది.. ఏకే శర్మ అనే గుజరాత్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. ఆయన మోడీకి బాగా దగ్గరనే ప్రచారం ఉండనే ఉంది. ఇప్పుడు ఈ ఏకే శర్మనే… నిరవ్ మోడీ, మోహుల్ చోక్సీల కేసును…సీబీఐ తరపున విచారణ జరుపుతున్నారట. హై ప్రొఫైల్, వివాదాస్పదమైన కేసులో ప్రధాని ఆమోదం లేకుండా లుక్ ఔట్ నోటీసులను సీబీఐ మార్చడం ఎలా సాధ్యమని రాహుల్ సంధించిన ప్రశ్నలకు ఇప్పటికీ బీజేపీ వైపు నుంచి సరైన సమాధానం రావడం లేదు.
ఏకే శర్మ ప్రస్తుతం అదనపు డైరెక్టర్ విభాగం, అవినీతి నిరోధక యూనిట్లలో పనిచేస్తున్నారు. ఎంతో కీలకమైన కేసుల మాత్రమే ఆయన చూసుకుంటారు. ఈ కీలకమైన కేసులు.. బ్యాంకుల్ని ముంచి.. విదేశాలకు పారిపోయిన వారివే. కారణం ఏమిటో కానీ.. ఇలా పారిపోయిన వారు ఒక్కరంటే ఒక్కరు కూడా దొరకడం లేదు. ఇంత పెద్ద భారతదేశం.. ప్రపంచం మొత్తం.. ప్రత్యేకంగా నేరగాళ్ల అప్పగింత ఒప్పందాలు ఎక్కువగా ఉన్న దేశంలో… ఇద్దరు నిందితుల్ని పట్టుకోవడం కాదు కదా.. కనీసం వారు ఎక్కడ ఉంటున్నారో.. ఎక్కడెక్కడ తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేనంత స్థితిలో సీబీఐ ఉంది.
నిజానికి నివర్ మోడీ, మోహుల్ చోక్సీ ఇద్దరూ… పాస్ పోర్టు రద్దయిందని భారత ప్రభుత్వం చెప్పిన తర్వాత కూడా చాలా కాలం పాటు.. దానిపైనే ప్రయాణం చేశారు. భారత పాస్ పోర్టుతో వారు ఎక్కడికి ప్రయాణం చేసినా.. క్షణాల్లో సమాచారం… ఆయన ఎంబసీలకు చేరుతుంది. కానీ… నెలగు గడుస్తున్నా… ఏ ఒక్కర్నీ ప్రభుత్వం వెనక్కి తీసుకురాలేకపోయింది. మోహుల్ చోక్సీకి అంటిగ్వా పౌరసత్వం వచ్చేసింది. దీనిపై… ప్రభుత్వాన్ని .. ఆ దేశం వివరణ అడిగితే.. ఎలాంటి అభ్యంతరాలు లేవని.. కేంద్రమే సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మల్యాను దేశం దాటించింది.. బీజేపీ నేతలేనంటున్నారు. ఈ విషయంలో రోజుకో అంశం బయటకు వస్తోంది. ఇలా రుణాలు ఎగ్గొట్టిన పారిపోయే వాళ్లందర్నీ..”హిందూస్థాన్ లీవర్స్” అంటూ అని పిలుస్తున్నారు జనం. వీరికి అండగా మోడీ ఉన్నారనేది .. వీడిబోతున్న మబ్బుల వెనుక ఉన్న రహస్యంగా.. ప్రచారం జరుగుతోంది.