నిన్న అనంతపురం జిల్లాలో బండ్లపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయిన ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్ ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. పార్లమెంటులో తను ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోడిపై ఉందని డా.మన్మోహన్ సింగ్ అన్నారు. ప్రత్యేక హోదా అంశం రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి సంబందించిన విషయమని రాహుల్ గాంధి అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటపుడు ఆంధ్రా, రాయలసీమ ప్రజలు లక్షలాది మంది రోడ్ల మీదకు వచ్చి సుమారు మూడు నెలలపాటు నిరసనలు తెలియజేస్తూ ఉద్యమాలు చేసినా మాజీ ప్రధాని డా. మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధి గానీ పట్టించుకోలేదు. కనీసం తమ స్వంత పార్టీ నేతల సలహాలను కూడా పట్టించుకోకుండా తన రాజకీయ ప్రయోజనాలను మాత్రమే చూసుకొని రాష్ట్ర విభజన చేసి ఆంద్ర, రాయలసీమ ప్రజల ఆత్మాభిమానాన్ని ఘోరంగా దెబ్బ తీసారు. అందుకే ఆ పార్టీకి 2014 ఎన్నికలలో ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి ప్రజలు ప్రతీకారం తీర్చుకొన్నారు.
నేటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలలో ఆగ్రహం చల్లారలేదు. ఆ కారణంగా దాని భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతున్నందున కన్నా, డొక్కా, బొత్స, ఆనం, కావూరి, జేసీ బ్రదర్స్ వంటి హేమాహేమీలయిన నేతలు అందరూ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వేరే పార్తీలలోకి వెళ్లి పోతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని నెత్తిన పెట్టుకొని మోసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను చాలా ఘోరంగా అవమానించి వారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీసినందుకు చివరికి తాను కూడా దెబ్బపోయింది. కానీ ఇదేమీ గుర్తించనట్లుగా రాహుల్ గాంధి వచ్చి ప్రత్యేక హోదా ఆంధ్రుల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని ఇప్పుడు చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలని నిర్ణయించుకొన్న తరువాత దాని కోసం యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రమంత్రుల కమిటీ సుమారు ఆరు నెలల పాటు కసరత్తు చేసింది. కాంగ్రెస్ పార్టీకి నిజంగా రాష్ట్ర ప్రజల పట్ల అంత అభిమానం ఉండి ఉంటే, ఆ సమయంలోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేసి ఉండవచ్చును. లేదా కనీసం విభజన చట్టంలో దానిని చేర్చి ఉండవచ్చును. కానీ చేయలేదు. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇవ్వడం అంటే తేనె తుట్టెను కదిపినట్లే అవుతుందని దానికీ తెలుసు గనుకనే.
అందుకే ఆఖరి నిమిషం వరకు దాని గురించి మాట్లాడనే లేదు. కానీ విభజన ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ సమూలంగా తుడిచిపెట్టుకుపోబోతోందనే సంగతిని కాంగ్రెస్ అధిష్టానం బాగానే గ్రహించింది. అలాగే కేంద్రంలో కూడా మళ్ళీ తమ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని కూడా గ్రహించింది. అందుకే కాంగ్రెస్ అధిష్టానం చాలా అతితెలివి ప్రదర్శించి ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని ఆఖరు నిమిషంలో అప్పటి ప్రధాని డా. మన్మోహన్ సింగ్ చేత పార్లమెంటులో ప్రకటింపజేసింది.
అందుకు రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. ప్రత్యేక హోదా ఇస్తామని ఆశ జూపి ఏపిలో ఓట్లు రాబట్టుకోవాలనే దురాలోచన. 2. తమ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎలాగూ లేవు కనుక ప్రత్యేక హోదా అనే ఆ గుదిబండని తరువాత రాబోయే మోడీ మెడకు తగిలించవచ్చనే దూర దురాలోచన కావచ్చును.
ఒకవేళ పొరపాటున కాంగ్రెస్ పార్టీయే కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చినా కూడా అది కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. ఇచ్చే అవకాశమే ఉంటే ఇంతకాలం ఇవ్వకుండా మోడీ ప్రభుత్వం ఇంత చెడ్డపేరు మూటగట్టుకొని ఉండేదే కాదు. ఎప్పుడో ఇచ్చేసి ఉండేది. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదు కనుకనే ఆనాడు యూపీఏ ప్రభుత్వం దానిని విభజన చట్టంలో చేర్చలేదని భావించాల్సి ఉంటుంది. ఒకవేళ తామే మళ్ళీ అధికారంలోకి వచ్చినా దాని వలన మళ్ళీ తమకు కూడా ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకే చాలా ముందు జాగ్రత్తగా డా. మన్మోహన్ సింగ్ చేత కేవలం నోటి మాటగా చెప్పించి ఉండవచ్చును.
ప్రత్యేక హోదా విషయంలో ఇంత దూర, దురాలోచనలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో తన పార్టీ భవిష్యత్ ఏవిధంగా ఉండబోతోందో ఆలోచించలేకపోవడం విచిత్రం. ఇన్ని తప్పులు చేసిన తరువాత కూడా ఒక్కనాడు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరూ కూడా అందుకు పశ్చాతాపం ప్రకటించలేదు. పైగా మోడీ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వాల కోసం తాము తయారుచేసిన ‘ప్రత్యేక ఉచ్చు’ను బిగించుతూ వారిని రాజకీయంగా దెబ్బ తీయాలని ఒకవైపు ప్రయత్నిస్తూనే, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆత్మాభిమానం, ఆత్మగౌరవం నిలబెట్టడం కోసమే తాము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
“ప్రజలు మూర్కులు…వారికి ఆలోచించే శక్తి ఉండదు…ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేస్తారు…” అనే చులకన భావం చాలా మంది రాజకీయ నేతలలో కనిపిస్తుంటుంది. రాహుల్ గాంధీ కూడా అటువంటి సగటు రాజకీయ నాయకుడే. అతనికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల అటువంటి భావమే ఉంది కనుకనే ఇంకా వారితో చెలగాటం ఆడే ప్రయత్నం చేస్తున్నారని చెప్పవచ్చును. కానీ దానికి మూల్యం చెల్లించడానికి వచ్చే ఎన్నికల వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మిగిలి ఉంటుందో లేదో చూడాలి.