తెలంగాణపై జాతీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నెల పదిహేడో తేదీన తెలంగాణకు వస్తారని వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభలో పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ నేతలు ఇంతకు ముందే ప్రకటించారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాకూర్ ఈ విషయాన్నిగాంధీ భవన్లో ప్రకటించారు. రాహుల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ టీమ్ ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. మరో వైప రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలి సారిగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నందున బలప్రదర్శన తరహాలో సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు.
అయితే అదే రోజు తెలంగాణ విమోచన దినం కూడా. అందుకే భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఆ రోజున అమిత్ షా ను తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు. ఆయన కూడా రావడానికి సిద్ధమయ్యారు. నిర్మల్ వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ సభకు ఏర్పాట్లు ప్రారంభించారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజాకార్లు ఊచకోత కోశారని అందుకే అక్కడ సభ పెడుతున్నామని బీజేపీ నేతలు చెబుతున్నారు.
ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఒకే రోజు తెలంగాణ పర్యటన పెట్టుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. టీఆర్ఎస్తో పోటీ పడేది మేమంటే మేమని రెండు పార్టీలు పోట్లాడుకుంటున్న వేళ… బల ప్రదర్శనలో రెండు పార్టీలు పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. గతంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమం చేసిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదని చెబుతోంది. దీనిపై రెండు పార్టీలూ టార్గెట్ చేసే అవకాశం ఉంది.