కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కోపం వచ్చింది. ఎప్పుడూ రొటీన్ గ సభల్లో మాట్లాడే రాహుల్, హటాత్తుగా ఉగ్రరూపం దాల్చారు. ప్రధాని నరేంద్ర మోడీపై దాడి చేశారు. మాటల తూటాలు పేల్చారు. చాలెంజ్ చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే, రాహుల్ గాంధీ ఆ మధ్య ఇంగ్లండ్ లో ఓ కంపెనీ పెట్టారని, తాను బ్రిటిష్ జాతీయుడినని అక్కడి కంపెనీస్ రిజిస్ట్రార్ కు రాతపూర్వకంగా తెలిపారని బీజేపీ నేత సుబ్రమణ్యం స్వామి ఆరోపించారు.
ఈ ఆరోపణ రాజకీయంగా దుమారం రేపింది. రాహుల్ గాంధీ వివరణ ఇవ్వాలని బీజేపీ నాయకులు వరసగా డిమాండ్ చేశారు. మూడు రోజులుగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మౌనంగా ఉండటంతో ఆరోపణ నిజమేనేమో అని సామాన్యులే కాదు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా భావించే పరిస్థితి వచ్చింది. దీంతో రాహుల్ గాంధీ రెచ్చిపోయారు. స్వామికి కౌంటరిచ్చారు. మోడీని సవాల్ విసిరారు.
తనపై వచ్చిన ఆరోపణల మీద విచారణ జరపాలని మోడీని డిమాండ్ చేశారు. ఆరు నెలల్లో విచారణ పూర్తి చేసి, తనది తప్పని తేలితే అరెస్టు చేయాలని సవాల్ విసిరారు. బీజేపీకి, ఆరెస్సెస్ కు తాను భయపడటం లేదన్నారు. నేరుగా నాతోనే యుద్ధం చేయండని మోడీని చాలెంజ్ చేశారు. చెంచాలను అడ్డం పెట్టుకుని తన మీద బురద చల్లవద్దని మోడీని సలహా ఇచ్చారు. ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సదస్సులో రాహుల్ గాంధీ ఆవేశంతో ఊగిపోయారు.
రాహుల్ పై స్వామి చేసిన ఆరోపణ చాలా తీవ్రమైంది. ఒకవేళ బ్రిటిష్ జాతీయుడినని రాహుల్ గాంధీ పేర్కొన ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మన దేశ రాజ్యాంగం ప్రకారం ద్వంద్వ పౌరసత్వానికి అవకాశం లేదు. కాబట్టి రాహుల్ పౌరసత్వాన్ని, లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని స్వామి డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ జరిపించాలని ప్రధానికి లేఖ కూడా రాశారు.
ఇప్పుడు ఈ వ్యవహారంలో విచారణ జరిగితే ఏం బయటపడుతుంది? రాహుల్ పై ఆరోపణ అబద్ధమని తేలితే స్వామిపై చర్య తీసుకుంటారా? ఒకవేళ నిజమని తేలితే రాహుల్ గాంధీపై ఎంత తీవ్రమైన చర్య తీసుకునే అవకాశం ఉంది? ఆయన ఇక ఎప్పటికీ ప్రధాని కాలేరా? ఈ ప్రశ్నలే ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ శిబిరాల్లో చక్కర్లు కొడుతున్నాయి. విచారణకు మోడీ ప్రభుత్వం ఆదేశిస్తే, అది పూర్తయితేనే ఏది నిజమో తేటతెల్లమవుతుంది. ఈలోగా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లోనూ ఈ ప్రభావం ఉండొచ్చు