వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌కు ఆయన ముఖ్యమంత్రి అవుతారని, ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న తమిళనాట పార్టీని గెలిపిస్తే ఆయననే ముఖ్యమంత్రిని చేయగలమని రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి. అవును మరి.. ‘ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్’ అన్న సామెత చందంగా.. ఖాళీగా ఉన్న నాయకుడి చుట్టూ ఇలాంటి పుకార్లు అనేకం పుట్టినా ఆశ్చర్యపోనవసరం లేదు. రాహుల్ గాంధీని యూపీకి, తమిళనాడుకు ముఖ్యమంత్రి చేస్తారనే ప్రచారాలు వినిపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ పార్టీ కీలక నాయకులు, ప్రధానంగా రాహుల్ కోటరీకి చెందిన ముఖ్యనాయకులు కొట్టి పారేస్తున్నారు. తమిళనాడులో అయితే డీఎంకేతో పొత్తులు పెట్టుకుని.. కోరినన్ని సీట్లు దక్కించుకోవడానికి కూడా ఠికానా లేని కాంగ్రెస్ పార్టీకి ఏకంగా రాహుల్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే పుకారు ఎలా పుట్టిందో కూడా ఆశ్చర్యమే.
అయితే రాహుల్ కోటరీ పెద్దలు ఒక్క విషయంలో మాత్రం క్లారిటీ ఇస్తున్నారు. ఈ ఏడాదిలోనే రాహుల్ నెత్తిన పార్టీ కిరీటం పెట్టబోతున్నారు. ఆయన 2016లోనే పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే అవకాశం ఉన్నదని.. వారి వ్యూహకర్తల్లో ముఖ్యుడు, కాంగ్రెస్ పార్టీ తెరవెనుక రాజకీయాల్లో కీలకంగా చక్రంతిప్పుతూ ఉండే మాజీ మంత్రి జైరాం రమేష్ వెల్లడించడం గమనార్హం.
కాంగ్రెస్ పార్టీ తాము ఎదుర్కొంటున్న సకల సమస్యలను పరిష్కరించగల, తమను సకల కష్టాలనుంచి గట్టెక్కించగల జిందా తిలిస్మాత్ వంటి నాయకుడు అని కాంగ్రెస్ భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దారుణంగా పరాభవం చెందిన తర్వాత.. ఇప్పటిదాకా దేశంలో ఏమూల జరిగిన ఏ ఎన్నికల్లో కూడా ఇప్పటిదాకా కాంగ్రెఎస్ పార్టీ మళ్లీ భవిష్యత్తు గురించి ఆశలు నిర్మించుకునే స్థాయిలో పెర్ఫార్మ్చేయలేకపోయింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. నెత్తిన అధ్యక్ష కిరీటం లేకపోయినప్పటికీ.. గత సార్వత్రిక ఎన్నికల నాటినుంచి నేటి వరకు కూడా పార్టీని నడిపిస్తున్నది రాహుల్ గాంధీనే! అలాంటిది ఇప్పుడు కొత్తగా అధ్యక్ష కిరీటాన్ని ధరింపజేసినత మాత్రాన.. కొత్తగా ఆయన ఉద్ధరించేసేది ఏముంటుందని వ్యాఖ్యానిస్తున్న వారు కూడా అనేకులు ఉన్నారు.