దేశం ఇప్పుడు గడ్డు పరిస్థితుల్లో ఉంది. ఓ వైపు వైరస్ విజృంభణ.. మరో వైపు.. ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నమవడంతో.. భవిష్యత్ గందరగోళంగా ఉంది. ఈ సమయంలో రాహుల్ గాంధీ తెలివైన రాజకీయం చేస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తే.. దానికి నేషనలిజం ముసుగును బీజేపీ నేతలు తొడుగుతూండటంతో భిన్నమార్గంలో సలహాలు… సూచనలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జర్నలిస్ట్ అవతారం ఎత్తారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్‌తో ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కారాలపై… ముఖాముఖి మాట్లాడారు . దాన్ని అన్ని రకాల సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు మీడియాకూ ఇచ్చారు.
రఘురాంరాజన్ కు … భారత్ ఆర్థిక వ్యవస్థను క్లిష్ట పరిస్థితుల్లో చక్కదిద్దిన ఆర్బీఐ గవర్నర్‌గా పేరు ఉంది. ఆయన సలహాలు ఎంతో విలువైనవిగా భావిస్తూంటారు. రాహుల్ గాంధీ ఆయనతో జరిగిన ముఖాముఖిలో.. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు.. పరిష్కార మార్గాలను రాబట్టారు. వాటిని హైలెటయ్యేలా చేశారు. భారత్ లాక్డౌన్ ఎత్తివేసే విషయంలో అత్యంత తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉపాధి కోల్పోయిన పేదల్ని ఆదుకోవడానికి రూ. 65వేల కోట్లు వెచ్చించాల్సి ఉంటుందని రఘురాం రాజన్ విశ్లేషించారు. వ్యాపారాలు, కార్యాలయాలు ఎలా పునఃప్రారంభించాలన్న దానిపై ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేయాల్సి ఉందని రాజన్ చెప్పారు. ఈ సంక్షోభ సమయంలో అధికార వికేంద్రీకరణ చాలా ముఖ్యమన్నారు.
రఘురాం రాజన్ ప్రపంచంలో ప్రసిద్ది చెందిన ఆర్థిక వేత్తల్లో ఒకరు. దేశం కోసం తాను సలహాలివ్వడానికి సిద్ధంగా ఉన్నానని గతంలోనే ప్రకటించారు. అయితే.. బీజేపీ పెద్దలు ఆయన పట్ల సదభిప్రాయంతో లేరు. అందుకే.. ఆర్బీఐగవర్నర్ గా ఆయన పదవీ కాలన్ని పొడిగించలేదు. అందుకే రాహుల్ గాంధీ తెలివిగా.. ముఖాముఖి నిర్వహించి ఆయన సలహాలను కేంద్ర ప్రభుత్వానికిచేరేలా చేశారు. రాహుల్ గాంధీ కొద్ది రోజుల క్రితం… భారత కార్పొరేట్ సంస్థలు బలహీనపడ్డాయని.. వాటిని విదేశీ సంస్థలు కైవసం చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇది నిజమేననుకున్న కేంద్రం.. వెంటనే చైనా నుంచి వచ్చే పెట్టుబడులపై ఆంక్షలు విధించింది.వలస కూలీల విషయంలోనూ రాహుల్ చెప్పిన సూచలను కేంద్రం పాటించింది. రాహుల్ గాంధీ..ఈ ముఖాముఖిలను మరిన్ని విభిన్న రంగాల నిపుణులతో నిర్వహించి.. కేంద్రానికి సలహాలివ్వాలని అనుకుంటున్నారు.