తెలంగాణలో ఏర్పడ్డ కూటమి… జాతీయ స్థాయి రాజకీయాల దృష్ట్యా కూడా ఒక చారిత్రక పరిణామం కానుందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఖమ్మం సభలో ఆయన మాట్లాడుతూ… ఇది కేవలం తెలంగాణకు పరిమితమైంది కాదనీ, దేశ భవిష్యత్తుకు అవసరమైన అంశమని చెప్పారు. సుప్రీం కోర్టు, సీబీఐ, ఆర్బీఐ, ఈసీ… ఇలా ఒక్కో వ్యవస్థనీ నరేంద్ర మోడీ నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో విజయం సాధించిన తరువాత… ఇదే కూటమి ఢిల్లీలో మోడీ గద్దె దింపే పనిలో ఉంటుందన్నారు. తెలంగాణలో ముందుగా మోడీ బి-టీమ్ తో పోరాటం చేసి గెలుద్దామనీ, ఆ తరువాత ఢిల్లీలో ఎ- టీమ్ ని ఓడిద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోడీని మరోసారి గెలిపించాలని తెరాస, ఎమ్.ఐ.ఎమ్. కోరుకుంటున్నాయన్నారు రాహుల్. కాంగ్రెస్, టీడీపీ, టీజేయస్ వంటి పార్టీలతో కూడిన ఈ ప్రజా కూటమి… భాజపా కూటమి పార్టీ అయిన తెరాసను ఇక్కడ ఓడిస్తుందన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రా, తెలంగాణలకు కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందన్నారు. తెలంగాణకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్, గిరిజన యూనివర్శిటీ, పన్ను రాయితీలు… ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉందనీ, కానీ ఇవేవీ ప్రధాని నరేంద్ర మోడీ చెయ్యలేదన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పేరు మార్చి, దానికి కాళేశ్వరం అని పేరు పెట్టి… అంచనాలను రూ. 40 వేల కోట్ల మేరకు పెంచేశారన్నారు. పేరు మార్చడం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రాజెక్టుగా ఇది మారిందని రాహుల్ ఎద్దేవా చేశారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పేరుతో పాత చెరువులకు రంగులెయ్యడానికే కేసీఆర్ డబ్బు ఖర్చు చేశారన్నారు.
టీడీపీ, కాంగ్రెస్ లు తొలిసారిగా ఒక వేదిక మీదికి రావడం రాజకీయాల్లో కచ్చితంగా ఒక కీలకమైన పరిణామమే. అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగంలో… తెరాస మీద విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని చెప్పుకోవచ్చు. మోడీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఏర్పడబోతున్న కూటమికి ఇది నాంది అన్నారు. రాహుల్ కంటే ముందు మాట్లాడిన చంద్రబాబు… టీడీపీ, కాంగ్రెస్ ల కలయిక ఒక చారిత్రక అవసరమని చెప్పారు. కానీ, రాహుల్ గాంధీ ప్రసంగంలో అలాంటి వ్యాఖ్యానాలు లేవు. నిజానికి, టీడీపీ గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడతారని అందరూ ఎదురుచూశారు. కానీ, కూటమిలో మిత్ర పక్షాలన్నింటినీ ఏకంగా చూస్తూన్నట్టుగానే రాహుల్ ప్రసంగమంతా సాగడం గమనార్హం.