దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. దేశంలో ఏదో ఓ మూల.. గుంపులుగా వెళ్లి జనాలను చంపడం అనే ఘటనలు తరచబూ బయటపడుతున్నారు. రాజస్థాన్ అల్వార్‌లో జరిగిన ఘటన.. ఇప్పుడు దేశ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆవులను అక్రమంగా తరలిస్తున్నాడన్న అనుమానంతో రాజస్థాన్ అల్వార్‌లో రక్బర్ ఖాన్ అనే స్థానికుడిని అల్లరి మూకలు చితకబాదాయి. పోలీసులు ఆసుపత్రికి తరలిస్తుండగా రక్బర్ చనిపోయాడు. అయితే, ఈ ఘటనలో మరోకోణం బయట పడింది. బాధితుడు పోలీసుల నిర్లక్ష్యం వల్లే చనిపోయినట్లు తేలింది. నోప్పితో అతను అల్లాడుతూంటే.. పోలీసులు తీరిగ్గా మొదట పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఆ తర్వాత ఆసుపత్రికి బయళ్లారు. పేషంట్‌ను అంబులెన్స్‌లో ఉంచి.. తాపీగా టీ తాగి మరీ.. ఆసుపత్రికి వెళ్లారు. ఘటన జరిగిన తర్వాత దాదాపు మూడు గంటలకు గానీ.. బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లలేకపోయారు. కానీ అప్పటికే అతను చనిపోయాడు.
ఈ ఘటన జాతీయ రాజకీయాలను కుదిపేస్తోంది. ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుప్రతికి తీసుకెళ్లడానికి పోలీసులకు మూడు గంటలు పట్టింది. ఇదే ప్రధాని నిర్మించబోయే ‘బ్రూటల్ న్యూ ఇండియా’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ నిరసన తెలిపారు. మానవత్వం స్థానంలో విద్వేషాన్ని ఉంచి, ప్రజల ప్రాణాల పొగొట్టి మోదీ న్యూ ఇండియా నిర్మిస్తారని తీవ్ర ఆరోపణలతో ట్వీట్ చేశారు. దీనికి బీజేపీ నేతలు కూడా ఘాటుగా కౌంటర్ ఇస్తున్నారు. ఇలాంటి ఘటన జరిగినప్పుడు సంతోషంతో గంతులు వేయడం మానేయాలని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై చర్యలు తీసుకుందని ట్వీట్ చేశారు.
అల్వార్ ఘటనపై కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ స్పందన మరింత దుమారం రేపింది. మోదీకి పెరుగుతున్న పాపులారిటీని తట్టుకోలేకే.. ఇలాంటి ఘటనలతో అపఖ్యాతి తెచ్చేందుకు కుట్ర జరుగుతోందని అర్జున్ రామ్ వ్యాఖ్యలు చేశారు. ఇదంతా బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంగా కొట్టిపారేశారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి రాజ్ నాధ్ మూక దాడుల అంశంపై రాజకీయంగానే బదులిచ్చారు. వరుస ఘటనలతో కేంద్రం అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. సుప్రీం ఆదేశాలతో అమాయకులపై మూకుమ్మడి దాడులను అడ్డుకునేందుకు భారత శిక్షా స్మృతిలోని సంబంధిత సెక్షన్లను సవరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందు కోసం రాజ్‌నాథ్ నేతృత్వంలోనే ఓ కమిటీ వేశారు. కానీ బీజేపీ విధానమే అలా ఉంటే… ఏ కమిటీ కూడా ఏమీ చేయలేదు కదా..!