మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక… ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీ పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరుకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుందని దాదాపుగా స్పష్టమైన పరిస్థితి. దీంతో భాజపా, కాంగ్రెస్ ల మధ్య ఉన్న తేడాను స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ మేరకు సక్సెస్ అవుతున్నారనీ అనొచ్చు. రాహుల్ మీడియాతో మాట్లాడుతూ… దేశంలో ఒక పక్క రైతులు, సామాన్యులు, చిన్న వ్యాపారులున్నారనీ, మరోపక్క ఓ పదిహేను ఇరవై మంది బడా బాబులు ఉన్నారన్నారు. గడచిన నాలుగేళ్లలో ప్రధాని మోడీ ప్రజల జేబుల్లోంచి రూ. మూడున్నర లక్షల కోట్ల సొమ్ము తీసుకుని, ఆ కొద్దిమంది జేబులను మాత్రమే మోడీ నింపారని రాహుల్ ఆరోపించారు.
మోడీ రెండు భారతదేశాలను నిర్మిస్తారనీ… ఒకటేమో ఆ కొద్దిమంది కోసం, వారి రుణమాఫీ కోసం, ప్రైవేట్ విమానాల కోసమని ఆరోపించారు. రెండోది పేద ప్రజలదీ, చిన్న వ్యాపారులదీ, రైతులదీ, కార్మికులది అన్నారు రాహుల్. తాము అధికారంలోకి వచ్చిన రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటైన ఆరు గంటల్లోపే రైతు రుణమాఫీ చేశామనీ, మరో రాష్ట్రంలో కూడా జరుగుతుందన్నారు. నాలుగేళ్లుగా మోడీ ప్రధానమంత్రిగా ఉంటూ ఒక్క రూపాయి కూడా రైతు రుణమాఫీ చెయ్యలేదన్నారు. దేశంలోని రైతులందరి రుణమాఫీ చేసే వరకూ ఆయన్ని నిద్రపోనివ్వమన్నారు. ఓ ఇరవై మందికి మాత్రమే మోడీ రుణమాఫీ చేశారని ఎద్దేవా చేశారు.
రాహుల్ చాలా వ్యూహాత్మకంగా మాట్లాడారని చెప్పొచ్చు. రైతు రుణమాఫీ విషయంలో భాజపా ఇప్పటికిప్పుడు సానుకూల నిర్ణయం తీసుకోలేదు. వాస్తవానికి భాజపా దీనికి వ్యతిరేకం కూడా! కాబట్టి, ఈ అంశాన్ని అత్యంత బలమైన విమర్శనాస్త్రంగా రాహుల్ మార్చుకున్నారు. కొద్దిమంది పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నేరగాళ్లవైపు మాత్రమే భాజపా ఉందనీ, సామాన్య ప్రజల వైపు తాము ఉంటామనే స్పష్టమైన విభజనతో మాట్లాడుతున్నారు. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు నిర్ణయాల వల్ల ఎక్కువగా నష్టపోయింది సామాన్యులు తప్ప, డబ్బున్నవారు కాదని పదేపదే గుర్తు చేస్తుంటారు. మోడీ సర్కారు నిర్ణయాల వల్ల నష్టపోయినవారి వెంట కాంగ్రెస్ ఉంటుందనే భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి… భాజపాకి ధీటుగా పోటీపడేందుకు కావాల్సిన అజెండాని దాదాపుగా రాహుల్ సెట్ చేసుకున్నట్టే.