మోడీ ప్రభుత్వానికి రెండేళ్ళు పూర్తయింది. కనుక ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్రమంత్రులు, భాజపా అగ్రనేతలతో సహా అందరూ తమ ప్రభుత్వ గొప్పదనం గురించి చెప్పుకొంటున్నారు. అందులో అసహజమేమి లేదు. కానీ వారిని కాంగ్రెస్ నేతలు విమర్శించడం చాలా అసహజంగా ఉంది.
ఈ రెండేళ్ళ మోడీ ప్రభుత్వ పాలనలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి గురించి ప్రజలు కూడా చర్చించుకొంటున్నారు. ఈ రెండేళ్ళలో మోడీ ప్రభుత్వంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా రాలేదు కానీ రెండేళ్ళు గడిచినా నేటికీ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతి, కుంభకోణాల గురించి చర్చలు,కేసులు సాగుతూనే ఉన్నాయి. అదే మోడీ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్య ఉన్న పెద్ద తేడా అని చెప్పవచ్చు.
అవినీతి ఆరోపణలతో జైలుకి వెళ్లి వచ్చిన ఎడ్యూరప్పనే కర్నాటక భాజపా అధ్యక్షుడుగా నియమించుకోవడం, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో ప్రాజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాల కూల్చివేతకి ప్రయత్నాలు, హిందూ మతభావాలను దేశ ప్రజలపై బలవంతంగా రుద్దే ప్రయత్నాల వలన మోడీ ప్రభుత్వానికి కూడా కొంత కళంకం అంటుకొందని చెప్పక తప్పదు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు గత ఆరు దశాబ్దాలలో చేయలేని అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మోడీ ప్రభుత్వం ఈ రెండేళ్లలో చేసింది. అలాగే దేశ భవిష్యత్ ని, దేశంలో వివిధ వ్యవస్థలు, వివిధ వర్గాల ప్రజలకు మేలు చేకూర్చే అనేక కీలక నిర్ణయాలు తీసుకొంది. వాటిలో సామాన్య ప్రజల కంటికి కూడా కనబడేవి కొన్నయితే, కనబడనివే చాలా ఎక్కువ. రక్షణ రంగంలో దళారీ వ్యవస్తలని నిర్మూలించడానికి చేపట్టిన చర్యలు పైకి కనబడనివైతే, పదవీ విరమణ చేసిన రక్షణ రంగ ఉద్యోగులకు ఒకే ర్యాంక్ ఒకే పెన్షన్, మారుమూల గ్రామాలకి రోడ్లు, విద్యుత్, మంచినీళ్ళు, వైద్యం వంటి మౌలికవసతుల కల్పన వంటివి అందరికీ కనబడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు.
ఆ పధకాలు, పనులు అన్నీ కాంగ్రెస్ హయాంలో చేపట్టినవే..వాటినే మోడీ ప్రభుత్వం పేర్లు మార్చి తమవిగా చెప్పుకొంటోందని కాంగ్రెస్ పార్టీ నేతల వాదన సరైనదే కావచ్చు కానీ అది మొదలుపెట్టి పూర్తి చేయకుండా మధ్యలో వదిలేసిన అనేక పనులను మోడీ ప్రభుత్వం కొనసాగించి పూర్తి చేస్తున్నప్పుడు ఆ క్రెడిట్ తన ప్రభుత్వానికే దక్కాలనే ఉద్దేశ్యంతో మోడీ ప్రభుత్వం తనకు నచ్చిన పేర్లు పెట్టుకొంటే అది తప్పు కాదు.
కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండి ఉంటే, పదేళ్ళ పాలనలో దేశాన్ని చాలా అభివృద్ధి చేయగలిగి ఉండేది. కానీ అది పదేళ్ళలో సగటున ఏడాదికి రెండు కుంభకోణాలతోనే తీరిక లేకుండా గడిపేసింది. కనుక మోడీ ప్రభుత్వాన్ని అది వేలెత్తిచూపడం హాస్యాస్పదం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పాలన నిజంగా దేశ ప్రజలు మెచ్చుకొనే విధంగా సాగి ఉండి ఉంటే లౌకిక పార్టీగా గుర్తింపుకలిగిన దానిని పక్కనబెట్టి మతతత్వ పార్టీగా ముద్రపడిన భాజపాకి ఎందుకు అధికారం కట్టబెడతారు? కాంగ్రెస్ పెద్దలు ఇప్పటికైనా దేశ ప్రజలు తమ పార్టీని ఎందుకు పదేపదే తిరస్కరిస్తున్నారో గ్రహించి, తమ ఆలోచనా విధానాన్ని, లోపాలను సవరించుకొని, ప్రజాభీష్టానికి అనుగుణంగా తమను తాము మలుచుకోకపోతే నిజంగానే భాజపా చెపుతున్నట్లుగా “కాంగ్రెస్ ముక్త్ దేశ్” (కాంగ్రెస్ రహిత దేశం) అవుతుంది.