కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గత పదకొండేళ్ళుగా క్రమం తప్పకుండా తన అమేధీ నియోజక వర్గానికి వెళ్లి అక్కడ నిరుపేదల గుడిసెలలోకి వెళ్లి వారు తింటున్న భోజనమే తిని వారి కష్ట సుఖాలు తెలుసుకొంటుంటారు. అలాగే నడిరోడ్డు మీద రిక్షావాళ్ళ మధ్య నిలబడి వారు అడిగిన ప్రశ్నలన్నిటికీ ఆయన ఓపికగా జవాబు చెపుతున్నారు. రైళ్ళలో జనరల్ బోగీలో ప్రయాణించి నిరుపేద బాలలను తన ఒళ్లో కూర్చోబెట్టుకొని తన చొక్కాతో వారి చీమిడి ముక్కులు తుడిచి అందర్నీ ఇంప్రెస్ చేస్తుంటారు. చివరికి డిల్లీలో మునిసిపల్ సిబ్బందితో పాటు రోడ్డు మీద కూర్చొని వారి కోసం మోడీ ప్రభుత్వంతో పోరాడారు. ఇటీవల కొత్తగా మొదలుపెట్టిన ఓదార్పు యాత్రలలో కూడా అంతా సేమ్ టు సేమ్ గానే వ్యవహరిస్తున్నారు. నేరుగా బీద బిక్కీ జనాల మధ్య కూర్చొని వారి కష్ట సుఖాలు తెలుసుకొంటున్నారు. అంటే రాహుల్ గాంధీకి సామాన్య ప్రజలు అంటే ఎంత ఇష్టమో అర్ధమవుతోంది.
కానీ బస్టాండ్ లో టీ అమ్ముకొనే స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నరేంద్ర మోడీ ఏనాడూ పేద వాళ్ళతో అలాగా కలిసి కూర్చోని మాట్లాడ లేదు. ఒకవేళ మాట్లాడవలసి వస్తే ఎక్కడో తన కార్యాలయంలో కూర్చొని ‘మన్ కి బాత్’ అంటూ రేడియో ద్వారా నిరుపేదలతో తన మనసు పంచుకొంటుంటారు అంతే! ఆయన ఎప్పుడూ సూటు బూటే ధరిస్తారు. విమానాలలోనే తిరుగుతుంటారు. అది కూడా స్వదేశంలో కంటే విదేశాలలో తిరగడానికే ఆయన ఎక్కువ ఇష్టపడతారు. అపుడపుడు స్వచ్చా భారత్ అంటూ చీపురు పట్టుకొన్నా ఆయన ముందు వెనుక ఓ రెండొందల మంది ఉండాల్సిందే!
వెండి చెంచా నోట్లో పెట్టుకొని పుట్టి ప్రధాన మంత్రి కుర్చీలో పెరిగిన రాహుల్ గాంధీ ఇంత సింపుల్ గా బ్రతికేస్తుంటే, బస్టాండ్ లో టీ అమ్ముకొని జీవించిన నరేంద్ర మోడి ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొన్న ఇంత గొప్పగా రాజభోగం అనుభవిస్తుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
అందుకే మన రాహుల్ బాబు మోడీది ‘సూటు బూటు ప్రభుత్వం’ అని ఎప్పుడూ ఎద్దేవా చేస్తుంటారు. నిన్న బీహార్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తూ, “మోడీ చుట్టూ సూటు బూటు వేసుకొన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలే కనిపిస్తారు తప్ప ఏనాడయినా మీలాంటి నిరుపేదలు కనిపించారా? మోడీ ఏనాడయినా మీతో నేరుగా మాట్లాడేరా?” అని జనాల్ని ప్రశ్నించారు. ఎవరి మనసు నొప్పించడానికి బొత్తిగా ఇష్టపడని జనాలు ‘లేదు లేదు’ అని గట్టిగా అరిచి రాహుల్ బాబుని కూడా కుష్ చేసి పంపించేసారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ బాబు క్రమం తప్పకుండా అమేధీలో నిరుపేదల ఇంట్లో గంజి టెస్ట్ చేస్తుండేవారంటే దాని అర్ధం ఏమిటి? కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ పాటు దేశాన్ని పాలించినా కనీసం అమేధీలో కూడా ఆ నిరుపేదల జీవితాలలో ఎటువంటి మార్పు రాలేదని రాహుల్ బాబు స్వయంగా దృవీకరించిన్నట్లయింది. పదేళ్ళ కాంగ్రెస్ పరిపాలన తరువాత కూడా దేశంలో అభాగ్యుల పరిస్థితుల్లో ఎటువంటి మార్పు రాలేదని రాహుల్ తన పాదయాత్రల ద్వారా కళ్ళకి కట్టినట్లు చూపిస్తున్నారు. ఆత్మహత్యలు చేసుకొన్నా రైతు కుటుంబాల వద్దకు వెళ్లి వారి మధ్య కూర్చొని వారితో ఓదార్చడం బాగానే ఉంది. కానీ ఆ రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవలసి వచ్చింది? దానికి ఎవరు బాధ్యత వహించాలి? అంటే తమ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆయనే స్వయంగా దృవీకరిస్తున్నట్లుంది. పదేళ్ళ కాంగ్రెస్ పాలనలో దేశంలో నిరుపేదల జీవన స్థితిగతుల్లో ఎటువంటి మార్పు తేలేకపోయినా నిసిగ్గుగా వారి మధ్య కూర్చొని కబుర్లు చెప్పగల వ్యక్తి ఎవరయినా ఉన్నారంటే ఆయన రాహుల్ గాంధీ మాత్రమే.
మరి మోడీ సంగతి ఏమిటి? ఆయన పేదప్రజల మధ్య నుండే పైకి ఎదిగినవాడు. కానీ రాహుల్ గాంధీలాగ వాళ్ళ మధ్యన కూర్చొని కబుర్లు చెపుతూ కాలక్షేపం చేయకుండా వారి జీవితంలో మార్పు తీసుకురావడానికి తనేమీ చేయగలరో అవన్నీ చేస్తున్నారు. నిరుపేదల కోసం జన్ ధన్ యోజన ద్వారా వారి బ్యాంకు ఖాతాలు తెరిపించారు. దాని ద్వారా వారికి వైద్య, ఆరోగ్య భీమా కల్పిస్తున్నారు. ముద్రా యోజన ద్వారా వారికి బ్యాంకుల నుండి అప్పులు ఇప్పిస్తున్నారు. ఎంపీలు, మంత్రులు, కార్పోరేట్ సంస్థలను ప్రోత్సహించి గ్రామాలు దత్తత తీసుకొనేలా చేస్తున్నారు. దేశంలో పేదరికం పోవాలంటే ముందు అందరికీ ఉపాధి, ఉద్యోగం ఉండాలి. అందుకే దేశ విదేశాలు తిరిగి దేశంలో పరిశ్రమలు స్థాపించేందుకు కృషి చేస్తున్నారు. గత ఆరు దశాబ్దాలుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న అనేక సమస్యలని తనదైన శైలిలో పరిష్కారాలు చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం అయితే, తన ప్రభుత్వం చేతల ప్రభుత్వమని మోడీ నిరూపించి చూపిస్తున్నారు. కనుక ఆయన సూటు బూటు వేసుకొని విమానాలలో తిరిగినా దేశానికి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ తను చేయవలసిన పని చేయకుండా రాహుల్ గాంధీలాగ పేదప్రజల మధ్యన కూర్చొని కబుర్లు చెపితేనే తప్పు. దేశానికి తీరని నష్టం కలిగించినవారవుతారు.