భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ లో ఉత్తేజాన్ని తెచ్చిన రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అయ్యారా…? అంటే అవుననే అంటున్నాయి ఏఐసీసీ వర్గాలు. ఎన్నికల ముందు యాత్రలు కామనే అయినా, ఎన్నికలయి కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే యాత్రకు ప్లానింగ్ ఎంటీ అనుకుంటున్నారా…?
అవును. యాత్రకు ప్లాన్ చేశారు. ధన్యవాద్ యాత్ర పేరుతో ఈసారి రాహుల్ గాంధీ యాత్ర కొనసాగబోతుంది. అయితే, ఇది దేశవ్యాప్తంగా కాదు. కేవలం ఉత్తరప్రదేశ్ లో మాత్రమే. పైగా ఈసారి కూటమి తరఫున ఉన్న అఖిలేష్ యాదవ్, ప్రియాంక గాంధీ కూడా యాత్రలో పాల్గొనబోతున్నారు.
దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో యూపీ కీలకం. ఈసారి కూడా భారీగా సీట్లు వస్తాయని బీజేపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మోడీ పిలుపునిచ్చిన 400 పార్ నినాదంలో యూపీ కీలక పాత్ర అనుకున్నారు. కానీ తీరా చూస్తే… మెజారిటీ సీట్లు కూటమి దక్కించుకుంది. ఏకంగా అయోధ్యలో రామమందిరం నిర్మించిన తర్వాత మొదటి ఎన్నిక అయినా అక్కడ కూడా కూటమి విజయం సాధించింది. ఒకరకంగా బీజేపీకి ఛేదు ఫలితాలు రుచి చూడాల్సి వచ్చింది.
తమపై ఎంతో నమ్మకంతో అత్యధిక సీట్లు ఇచ్చినందున ధన్యవాద్ యాత్ర చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందుకు అఖిలేష్ యాదవ్ కూడా సముఖంగా ఉండటం… మరో రెండేళ్లలో యూపీ అసెంబ్లీకి ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడున్న జోష్ ను కంటిన్యూ చేయాలన్న కృతనిశ్చయంతో ఈ యాత్రకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఈ యాత్ర సక్సెస్ అయితే కూటమి మెజారిటీ సీట్లు తెచ్చుకున్న రాష్ట్రాల్లో కూడా ధన్యవాద్ యాత్రను చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం.