కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు త్వరలోనే రాహుల్ గాంధీకి ఇవ్వబోతున్నట్టు మళ్లీ కథనాలొస్తున్నాయి. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రాహుల్, తిరిగి వచ్చిన వెంటనే పట్టాభిషేకం జరుగుతుందని అంటున్నారు. ఈ ఏడాది నవంబర్ లోనే సోనియా నుంచి పార్టీ బాధ్యతలను రాహుల్ అప్పగించే కార్యక్రమ ఉంటుందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. 2019 లోక్ సభ ఎన్నికలతోపాటు, వివిధ రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రాహుల్ అధ్యక్షతన పార్టీ బరిలోకి దిగుతుందని అంటున్నారు. అయితే, రాహుల్ తోపాటు కాంగ్రెస్ పార్టీలోకి యువరక్తం ఎక్కించాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. అంటే, సీనియర్లను ఒక్కొక్కరిగా నెమ్మదిగా పక్కను పెడతానే వాదన వినిపిస్తోంది. తనకు కొత్త టీమ్ కావాలని రాహుల్ కూడా ఆశిస్తున్నారనీ, అందుకే యువతరానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయ్యారని సమాచారం. అంటే, సీనియర్లను కేవలం సలహాలకు మాత్రమే పరిమితం చేసి… పార్టీలో కొత్తవారి క్రియాశీలత పెంచాలని యువరాజు ఆశిస్తున్నారట!
దాన్లో భాగంగానే ఈ మధ్య అహ్మద్ పటేల్ వంటివారి బాధ్యతలపై కోత విధించారని అంటున్నారు. పార్టీలో కీలకంగా ఉంటూ, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ గా ఉన్న దిగ్విజయ్ సింగ్ బాధ్యతలకు కూడా కత్తెర పడటం వెనక కారణం ఇదే అని తెలుస్తోంది. దీంతోపాటు బీహార్, కర్ణాటక, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలకు పార్టీ ఇన్ ఛార్జ్ ల నియామకాలు కూడా రాహుల్ అభీష్టానుసారంగానే జరిగినట్టు చెబుతున్నారు. త్వరలోనే మరికొంతమంది సీనియర్లను కూడా పక్కనపెట్టేసే ఆలోచనలో రాహుల్ ఉన్నారనీ, ఆయన విదేశాల నుంచి వచ్చిన వెంటనే దశలవారీగా ఈ పని జరుగుతుందని అంటున్నారు.
నిజానికి, రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు త్వరగా ఇవ్వాలనే వాదనను బలంగా వినిపించింది సీనియర్లే! ఎప్పటికప్పుడు సోనియా మీద ఒత్తిడి తెచ్చింది వారే. యువ నాయకత్వం అవసరమనీ, రాహుల్ కు పార్టీ బాధ్యతలు ఇచ్చేయాలంటూ 2014 ఎన్నికలు ముగిసిన దగ్గర నుంచీ వారు అభిప్రాయపడుతూనే వస్తున్నారు. అయితే, చివరికి వారి సీట్ల కిందకే ఇప్పుడు నీళ్లు వస్తూ ఉండటం విశేషం. ఒక తరం మారుతున్నప్పుడు, కొత్త నాయకత్వం వస్తున్నప్పుడు రాజకీయ పార్టీల్లో ఇలాంటి మార్పులు సహజం. కానీ, ఇలా అదే పనిగా సీనియర్లను ఉన్నపళంగా పక్కన పెట్టేయాలన్న పంతంతో నిర్ణయాలు తీసుకుంటే అది వ్యతిరేకతకు కారణమౌతోంది. నిజానికి, భాజపా కూడా ఈ మధ్య వరుసగా సీనియర్లను పక్కన పెట్టేసింది. ఎల్.కె. అద్వానీ, వెంకయ్య నాయుడు, ఇతర ప్రముఖ భాజపా సీనియర్ నేతల్ని దశలవారీగా పక్కన పెట్టేశారు ప్రధాని మోడీ, అమిత్ షా ద్వయం. అలాంటి ప్రక్రియ ఒకటి జరుగుతున్నట్టు అనుమానాలు కూడా రానివ్వలేదు. ఇంత తీవ్రంగా చర్చ జరిగేందుకు ఆస్కారం ఇవ్వలేదు. మార్పులు అంటే అలా జరగాలిగానీ.. రాహుల్ వస్తే సీనియర్లను పక్కన పడేస్తున్నారు అని బహిరంగంగా అర్థమౌతున్నట్టుగా చేస్తే, సీనియర్లను నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. అంతేకాదు, పార్టీ కోసం ఎన్నాళ్లు కష్టపడి పనిచేసినా, అవసరం తీరిపోయాక ఇలానే కరివేపాకులా పక్కన పడేస్తారు అనే సంకేతాలు కింది స్థాయి కేడర్ కు వెళ్తాయి కదా! మరి, యువరాజు ఉద్దేశం ఏంటో..?