ఓ మూమెంట్లోకి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ చిచ్చు పెట్టి..కలహాల కాపురంగా మార్చాలని ప్లాన్ చేసుకున్న పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డిలకు రాహుల్ గాంధీ గట్టిగా షాక్ ఇచ్చి పంపించినట్లు కాంగ్రెస్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఎన్నికల స్ట్రాటజీ పై రాహుల్ తెంలగాణ నేతలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రాహుల్ తోనే తాము తేల్చుకుంటామని బయట ఉత్తమ్ రెడ్డి, జగ్గారెడ్డి భీకర ప్రకటనలు చేసి ఉన్నారు. మీడియా ముందు వారు చేసిన అతి లోపల రాహుల్ కు తెలిసిందేమో కానీ..వారు తమ కంప్లైంట్లు చేయడానికి నోరెత్తగానే సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ లో ఎవరు పార్టీ కోసం పని చేస్తున్నారు.. ఎవరు వేషాలేస్తున్నారో తనకు మొత్తం తెలుసని.. ఇద్దర్ని పార్టీ నుంచి పంపేస్తే మొత్తం సెట్ అవుతుందని గట్టిగానే చెప్పారు. దీంతో జగ్గారెడ్డి, ఉత్తమ్ రెడ్డి గతుక్కుమన్నారు. మళ్లీ నోరు తెరవలేదు. రాహుల్ గాంధీ అదే సమయంలో .. ఎవరైనా పార్టీ అంతర్గత వ్యవహారాలపై మీడియాతో మాట్లాడితే సహించేది లేదని.. నేరుగా బయటకు పంపడమేనని తేల్చి చెప్పారు. ఏదైనా సమస్యలుంటే పార్టీ దృష్టికి తేవాల్సిందేనని చెప్పారు.
ఇటీవల పార్టీ లో తమపై దుష్ప్రచారం జరుగుతోందంటూ.. ఉత్తమ్ , జగ్గారెడ్డి మాత్రమే మాట్లాడుతున్నారు. రాహుల్ తో మీటింగ్ కు వెళ్లే ముందు జగ్గారెడ్డి కూడా.. కాంగ్రెస్ లోనే దరిద్రం అంటూ వ్యాఖ్యలు చేశారు . అవి మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రాహుల్ ఇక సహించేది లేదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు. సమావేశం తర్వాత ఇతర పార్టీ పెద్దలుకూడా వారిద్దరికీ అదే చెప్పారని.. పార్టీలో ఉండాలనుకుంటే పార్టీ లో రచ్చ చేస్తే కుదరదని తేల్చేసినట్లుగా చెబుతున్నారు.దీంతో చిచ్చు పెట్టి మీడియాలో చర్చ పెట్టాలనుకున్న ఉత్తమ్, జగ్గారెడ్డిలకు నోటి మాట రాని పరిస్థితి ఎదురయింది.