దేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను, విద్యార్ధులను ప్రోత్సహించేందుకు ప్రధాని నరేంద్ర మోడి ఇటీవల ప్రకటించిన స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి స్పందిస్తూ “అసహనం, స్టార్ట్ అప్ రెండూ విభిన్నమయినవి. దేశంలో అసహనం ఉన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలేవీ ఫలించవు. దేశ ప్రజలను ఆకట్టుకోవడానికి ఏదో ఆర్భాటంగా ఇటువంటి కార్యక్రమాలు ప్రకటించే బదులు, ముందుగా బీజేపీ తన అసహనాన్ని వదిలించుకొనే ప్రయత్నం చేస్తే బాగుంటుంది,” అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడి ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నఈ స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమానికి విదివిధానాలు రూపకల్పన కోసం ప్రభుత్వంలో వివిధ శాఖలు సుమారు ఏడాది పాటు కసరత్తు చేసాయి. ఆ తరువాతే నరేంద్ర మోడీ మొన్న ఈ స్టార్ట్ అప్ ఇండియా కార్యక్రమం అమలుచేయబోతున్నట్లు ప్రకటించేరు. దానిని రాహుల్ గాంధి చాలా తేలికగా తీసిపడేశారు. అందుకే బీజేపీ కూడా చాలా ఘాటుగా బదులిచ్చింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిట్ పాత్ర ఈవిధంగా అన్నారు.
“నిజానికి రాహుల్ గాంధియే ఇంకా స్టార్ట్ అప్ స్టేజిలో ఉన్నారు. ఆయన రాజకీయాలలోకి ప్రవేశించారు కానీ దానిలో నుండి ఎలాగ బయట పడాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. పదేళ్ళ పాటు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించినపుడు అది దేశాభివృద్ధి కోసం ఏమి చేయలేకపోయింది. కానీ మా ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం ఒక మంచి కార్యక్రమం తీసుకువస్తే, దానిని ఇంకా మొదలుపెట్టక మునుపే ఆయన తీర్పు చెప్పేస్తున్నారు. ఆ కార్యక్రమం విజయవంతం కాకూడదని ఆయన కోరుకొంటున్నట్లుంది. ఒక సదుదేశ్యంతో మా ప్రభుత్వం చేపడుతున్న ఒక మంచి కార్యక్రమం పట్ల ఆవిధంగా మాట్లాడి రాహుల్ గాంధియే వ్యతిరేకత, అసహనం వ్యక్తం చేస్తున్నారు, అని అన్నారు.
“బిహార్ లో మళ్ళీ ఆటవిక రాజ్య స్థాపన జరిగిన తరువాత ఇప్పుడు అక్కడ నిత్యం ఇంజనీర్లు, వైద్యులు, వ్యాపారులను కిడ్నాపులు జరుగుతున్నాయి. వాటిపై ఆయనెందుకు మాట్లాడరు. మాల్డాలో జరిగిన సంఘటన దేశభద్రతతో ముడిపడున్న అంశం. దానిపై కూడా రాహుల్ గాంధి నోరువిప్పరు కానీ మా ప్రభుత్వం ఏదయినా ఒక మంచి కార్యక్రమం మొదలుపెట్టిన వెంటనే, అది ఇంకా మొదలుపెట్టక మునుపే దానిని తప్పు పడుతూ విమర్శలు గుప్పిస్తుంటారు. రాహుల్ గాంధి ఇంకా స్టార్ట్ అప్ స్థితిలోనే ఉన్నారని చెప్పడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఉండబోదు,” అని సంబిట్ పాత్ర ఘాటుగా బదులిచ్చారు.