పశ్చిమ డిల్లీలోని షకూర్ బస్తీలో గల సుమారు 1200 ఇళ్ళను రైల్వే అధికారులు తొలగించిన ఘటనలో ఒక ఇంట్లో ఉన్న ఆరు నెలల పసిపాప మరణించింది. ఇళ్ళు తొలగించేముందు లోపల మనుషులు లేరని దృవీకరించుకోకుండా పొక్లెయిన్లు పెట్టి ఇళ్ళను తొలగించడంతో లోపల ఉన్న పసిపాప శిధిలాల క్రిందపడి నలిగి చనిపోయింది. “ఆ పని చేసిన వాళ్ళు మనుషులో పశువులో తెలియడం లేదని” అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
కానీ రైల్వే మంత్రి సురేష్ వెంకట్ ప్రభు, తమ అధికారులు ఆ ఇళ్ళను తొలగించక మునుపే ఆ పాప చనిపోయిందని వాదిస్తున్నారు. తమ అధికారులు బస్తీవాసులను అక్కడి నుంచి ఖాళీ చేయమని కోరుతూ ఇంతవరకు మూడు సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ వారు స్పందించలేదని, పైగా కొత్తగా మరి కొంత మంది అక్కడ గుడిసెలు వేసుకొన్నారని అన్నారు. 2014, మార్చి 15వరకు గడువు ఇచ్చినప్పటికీ ఇంతవరకు ఖాళీ చేయకపోవడంతో బలవంతంగా ఖాళీ చేయించవలసి వచ్చిందని రైల్వే మంత్రి అన్నారు.
జరిగిన దానికి రైల్వే మంత్రి ఏమాత్రం బాధపడకపోగా తమ తప్పును కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేయడంతో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ళ కూల్చివేత, పసిపాప మరణంపై విచారణ చేసేందుకు వెంటనే మేజిస్ట్రేట్ దర్యాప్తుకు ఆదేశించారు.
డిల్లీ ప్రభుత్వం రైల్వే అధికారుల మధ్య ఈ గొడవ సాగుతుంటే, మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి కూడా ప్రవేశించారు. “ఆమాద్మీ పార్టీ కార్యకర్తలు, ప్రభుత్వం దీనిపై ఎందుకు ఇంత హడావుడి చేస్తోందో తనకు అర్ధం కావడం లేదని అన్నారు.” ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆయనపై కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. “అతను ఏమీ తెలియని ఒక బాలుడు” అని అన్నారు. “రైల్వే శాఖను కేంద్రప్రభుత్వం చూస్తుందని బహుశః ఆ విషయం గురించి ఆయనకు కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ చెప్పినట్లు లేదు. అందుకే అలాగా మాట్లాడుతున్నారు. ఆ బస్తీలో 1992-94 నుండి చాలా మంది ఇళ్ళు కట్టుకొని నివసిస్తున్నారు. వారికి ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండానే రైల్వే అధికారులు వారి ఇళ్ళు కూలద్రోస్తుంటే మేము వారికి అడ్డుపడి నిరసనలు తెలుపుతుంటే రాహుల్ గాంధీ ఎందుకు..అని ప్రశ్నించడం చాలా హాస్యాస్పదంగా ఉంది,” అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.