రాహుల్ గాంధీ నేడోరేపో కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నారంటూ కాంగ్రెస్ నేతలు చాలా మంది చెప్పారు. కానీ ఆయన నేడోరేపో విదేశాలకి వెళ్ళబోతున్నట్లు ట్విట్టర్ ద్వారా అందరికీ తెలియజేశారు. ఈసారి కూడా ఆయన ఏ దేశం వెళ్ళుతున్నారో… ఎందుకు వెళ్ళుతున్నారో… మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పలేదు. బహుశః కాంగ్రెస్ నేతలకి కూడా తెలియదేమో?
గత ఏడాది కూడా ఆయన పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారని కాంగ్రెస్ నేతలు చెప్పిన తరువాతే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి శలవు పెట్టి రెండున్నర నెలలపాటు విదేశాలలో గడిపి వచ్చారు. పార్టీలో కొందరు సీనియర్లు రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి అభ్యంతరాలు వ్యక్తం చేసినందుకే ఆయన పార్టీపై అలిగి విదేశాలకి వెళ్లిపోయారని, మళ్ళీ హామీ ఇచ్చిన తరువాతనే తిరిగి వచ్చారని గుసగుసలు వినిపించాయి. చివరి నిమిషంలో ఏమయిందో తెలియదు కానీ సోనియా గాంధీ పదవీ కాలం మరో ఏడాదిపాటు అంటే ఈ జూన్ నెల వరకు పొడిగించారు.
ఇప్పుడు రాహుల్ గాంధీకి పార్టీ బాధ్యతలు అప్పగించవలసిన సమయం వచ్చేసిందని కాంగ్రెస్ నేతలే చాలా మంది చెప్పారు. మళ్ళీ పార్టీలో ఏమయిందో తెలియదు. రాహుల్ గాంధీ మళ్ళీ విదేశాలకి బయలుదేరిపోతున్నారు. ఈసారి కూడా ఆయన పార్టీపై అలిగి విదేశీయాత్రకి బయలుదేరుతున్నారా లేకపోతే పార్టీ బాధ్యతలు చేపట్టే మందు మళ్ళీ రీ-చార్జింగ్ చేయించుకొని వచ్చేందుకు బయలుదేరుతున్నారో ఇంకా తెలియవలసి ఉంది.
గత ఏడాది ఆయన విదేశాలకి వెళ్లివచ్చిన తరువాత రెండు మూడు నెలలు చాలా చురుకుగా వ్యవహరించారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆయన ప్రభుత్వాన్ని పార్లమెంటు లోపలా, బయటా కూడా చాలా చక్కగా ఎదుర్కొన్నారు. అదిచూసి రాహుల్ గాంధీలో ఇంత మార్పు ఎలాగా సాధ్యమైంది? ఆయన విదేశాలకి వెళ్లి ఏ రకం శిక్షణ తీసుకొన్నారు ఇంతగా చార్జ్ అయ్యారు? అని అందరూ అనుకొనేవారు. విదేశాలలో చేసుకొన్న ఆ చార్జింగ్ గట్టిగా మూడు నెలలు కూడా నిలువలేదు. దానితో ఆయన మళ్ళీ పాత రాహుల్ గాంధీ అయిపోయారు. కనుక మళ్ళీ రీచార్జింగ్ కోసమే విదేశాలకి వెళ్ళుతున్నారేమో?ననే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి.
విదేశాలలో రెండున్నర నెలలు చార్జింగ్ చేసుకొని వస్తే అది గట్టిగా మూడు నెలలు కూడా నిలబడకపోవడం చాలా ఇబ్బందికరమైన విషయమే. అందుకే రాహుల్ గాంధీ లోకల్ గా ఎక్కడైనా చార్జింగ్ దొరుకుతుందేమో వెతుకొంటే ఈ విమర్శల బాధ నుంచి తప్పించుకోవచ్చు కదా.