దేశానికి రాహుల్ గాంధీ నాయకత్వం అవసరమనీ, ఆయనకి పగ్గాలు ఇవ్వడం ద్వారానే దేశంలోని అన్ని వర్గాల ప్రజలకూ న్యాయం జరుగుతుందని ఓ పక్క కాంగ్రెస్ నేతలు భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గతవారంలో రాహుల్ తెలంగాణ వచ్చినప్పుడు, ఇక్కడి కాంగ్రెస్ నేతలు ఆయన్ని ప్రధాని అభ్యర్థి అన్నట్టుగానే ప్రొజెక్ట్ చేస్తూ మాట్లాడారు కదా! ఇప్పుడు విషయం ఏంటంటే… 2019 లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ కాదట..! ఆ విషయం చెప్పంది ఎవరంటే… సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి చిదంబరం..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే తాము ఎన్నికలు ఎదుర్కోనున్నామని అన్నారు చిదంబరం. ఓ టీవీ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ప్రాంతీయ పార్టీలతో కలిసి మహా కూటమి ఏర్పాటు చేయాలనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉందన్నారు. రాహుల్ ప్రధాని కాబోతున్నట్టు తామెప్పుడూ చెప్పలేదనీ, కొందరు కాంగ్రెస్ నేతలే ఇలా మాట్లాడుతున్నారని అన్నారు. రాహుల్ ప్రధాని అభ్యర్థి అని కొంతమంది అంటుంటే.. వారిని ఏఐసీసీ వారించిందని కూడా చెప్పారు. భాజపాని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతోనే తాము రాబోయే ఎన్నికల్ని ఎదుర్కొంటామన్నారు. భావసారూప్య పార్టీలను కలుపుకుని మహా కూటమి ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రయత్నాలు తీవ్రతరం చేసిందనీ, రాహుల్ తో సహా ఏ ఇతర నాయకుడినీ ప్రధాని అభ్యర్థిగా ఎన్నికల ముందు ప్రకటించే అవకాశం లేనే లేదని స్పష్టం చేశారు. ఎన్నికల తరువాత మహా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేస్తాయని చిదంబరం చెప్పారు!
నిజానికి, రాహుల్ ప్రధాని అభ్యర్థి అంటూ ఇప్పటికే ఓ పక్క భారీ ఎత్తున ప్రచారం సాగిపోతోంది. మహా కూటమి ఏర్పాటుకు కూడా అదే ప్రతిబంధకంగా ఉందనీ చెప్పొచ్చు. ప్రధాని అభ్యర్థి చర్చ ఇప్పుడు లేకుండా ఉంటేనే కాంగ్రెస్ కలిసి పనిచేయడానికి కొన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నాయి. అందుకేనేమో.. ఇప్పుడా చర్చను పక్కన పెట్టి, ఏకంగా రాహుల్ కూడా ప్రధాని అభ్యర్థి కాదనే అభిప్రాయాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పెద్దలు. నిజానికి, సంప్రదాయ కాంగ్రెస్ అభిమానులకు ఈ తరహా ప్రకటనలు రుచించే అవకాశం తక్కువే. మరి, ఈ ప్రకటనతో మహా కూటమి ఏర్పాటును వేగవంతం చేయాలనే కాంగ్రెస్ ప్రయత్నం ఎలా ఉంటుందో చూడాలి.