లోక్సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమించాలని కోరుతూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం చేసింది. పార్లమెంటు లోపల ప్రతిపక్షానికి నాయకత్వం వహించడానికి రాహుల్ సరైన వ్యక్తి అని అందరూ తేల్చారు. నిజానికి 2014, 2019లలోనూ ఇదే ప్రతిపాదన చేశారు కానీ రాహుల్ అంగీకరించలేదు. ఎందుకంటే అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాకు కావాల్సినట్లుగా కాంగ్రెస్ కు సంఖ్యాబలం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ 99 సీట్లు సాధించింది. అందుకే రాహుల్ ప్రతిపక్ష నేత హోదా తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
కాంగ్రెస్ ఫర్ఫార్మెన్స్ క్రెడిట్ లను రాహుల్ కు ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరిగిపోయాయి. రాహుల్ యాత్రల ఫలితమే విజయాలన్నారు. రాహుల్ గాంధీ కచ్చితంగా లోక్సభలో ప్రతిపక్ష నేత కావాలని ఆయన ధైర్యవంతుడని కాంగ్రెస్ నేతలు కీర్తిస్తున్నారు. గెలిచిన ఎంపీలకు రాహుల్ విందు కూడా ఇచ్చారు. అయితే ప్రతిపక్ష హోదా లేనప్పుడు దళితునికి… ఆ హోదా వచ్చినప్పుడు మాత్రం గాంధీ కుటుంబానికి ఇస్తారా అన్న సెటైర్లు సహజంగానే పడతాయి.
రాహుల్ గాంధీ గతంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి తీసుకునేందుకు రాహుల్ నిరాకరించారు. ఓ సారి తీసుకున్నా.. పార్టీ ముఖ్య నేతలు ఆధిపత్యపోరాటంతో ఎక్కువ నష్టం చేశారని ఆయన అలిగి రాజీనామా చేశారు. ఎవరు చెప్పినా అంగీకరించలేదు. చివరికి ఖర్గేకు పీఠం అప్పగించారు. ఇప్పుడు ప్రతిపక్ష హోదా మాత్రం తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.