ఢిల్లీలో సీబీఐ ప్రధాన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. అయితే, గతానికి భిన్నంగా రాహుల్ చాలా దూకుడుగా ఈ కార్యక్రమంలో కనిపించడం విశేషం. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా కనిపించారు. ఆయనే బారికెడ్లు దూకేసిన పరిస్థితి. దాంతో కార్యకర్తలు కూడా ఉత్సాహంగా ఆయన వెంట కదిలారు. రాహుల్ గాంధీలో ఆందోళనకారుడు కనిపించారని కూడా కొంతమంది అంటున్నారు. ఇక, ఒక జాతీయ మీడియా సంస్థ అయితే.. నాటి ఇందిరా గాంధీ దూకుడును రాహుల్ అనుకరించే ప్రయత్నం చేస్తున్నారనీ అభివర్ణించింది. అయితే, ఈ దూకుడును రాహుల్ గాంధీ తీరులో వచ్చిన పరిపూర్ణమార్పు అని చెప్పలేంగానీ… ఒక కొత్త కోణమైతే కనిపించింది.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ… అనిల్ అంబానీ జేబులో రూ. 30 వేల కోట్లను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేశారని రాహుల్ మండిపడ్డారు. వాయుసేన నుంచి డబ్బులు దోచుకున్నారనీ, యువత సొమ్మును కూడా దోచుకున్నారని అన్నారు. ఆయన పరుగెత్తి పారిపోయినా, ఎక్కడ దాక్కున్నా నిజం బయటకి వస్తుందన్నారు. సీబీఐ డైరెక్టర్ ను తప్పించినంత మాత్రాన ప్రయోజనం ఉండదనీ, దేశ ప్రజలందరికీ మోడీ దోపిడీ గురించి తెలిసి తీరుతుందన్నారు. రైతులకు ఒక్క రూపాయి కూడా మోడీ మేలు చెయ్యలేదన్నారు. నీరవ్ మోడీ, విజయ మాల్యా, లలిత్ మోడీ కూడా దేశాన్ని వదిలి పారిపోయారనీ, అనిల్ అంబానీ కూడా పారిపోవచ్చనీ, ఇలాంటి వారికి మేలు చేయడమే నరేంద్ర మోడీ పని అని ఎద్దేవా చేశారు. ‘దేశ్ కీ చోకీ దార్… చోర్ హె’ (కాపలాదారు దొంగ) అని ప్రజలందరికీ స్పష్టమౌతోందన్నారు.
నిజానికి, దేశాన్ని కుదిపేస్తున్న ఈ వ్యవహారంపై మోడీ సర్కారుకు రాజకీయంగా బాగానే మైనస్ అయ్యేట్టుగానే కనిపిస్తోంది. కాబట్టి, సహజంగానే కాంగ్రెస్ పార్టీ కూడా తమకు అనుకూలంగానే మార్చుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే, రాహుల్ చేపట్టిన ఆందోళనపై కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ తొలిసారిగా స్పందించడం విశేషం. సీబీఐ డైరెక్టర్ ను బాధ్యతల నుంచి తప్పించిన వ్యవహారంలో చర్చించడానికీ విమర్శించడానికీ పెద్దగా అంశమే లేదన్నారు. ఇలాంటి అంశాన్ని పట్టుకుని కాంగ్రెస్ పార్టీ అనవసర రాద్దాంతం చేస్తోందన్నారు. ఇక, అరుణ్ జైట్లీ కూడా ఈ వ్యవహారంపై స్పందిస్తూ… ఇందులో భాజపా సర్కారు చేసిన తప్పిదం ఏదీ లేదంటూ తప్పించుకునేలా వ్యాఖ్యానించారు.