కాంగ్రెస్ ఉపాద్యక్షుడు భావి అద్యక్షుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో చేసిన ప్రసంగాలూ వ్యాఖ్యలూ బాగా ప్రచారం పొందాయి. మొదటి రోజున ప్రధాని మోడీపై చేసిన కొన్ని వ్యాఖ్యలకు బిజెపి కేంద్ర మంత్రులు ఒక్కుమ్మడిగా విరుచుకుపడ్డారు. అయితే ఆయన మాత్రం తన పర్యటనా ప్రసంగాలూ కూడా ఆపిందిలేదు. మోడీని లేదా కేంద్రాన్ని అతిగా విమర్శించకుండా అనుకూల ప్రతికూలాంశాలు చెబుతూ వస్తున్నారు. అంతేగాక అమెరికా విదేశాంగ శాఖ, దౌత్యవర్గాల అధికారులతోనూ వ్యాపార వర్గాలతోనూ కూడా మంతనాలు ఇష్టాగోష్టులు నిర్వహిస్తున్నారట. విశేషం ఏమంటే ఇలా ఆయనతో కలసి పాల్గొన్న కొంతమంది అధికారులు రాహుల్ వ్యవహారశైలిని మెచ్చుకోవడం. తన గురించి విన్నదానితో పోలిస్తే కలిసి మాట్లాడ్డం వల్ల సరైన అభిప్రాయానికి రాగలిగామని వారు మీడియాతో చెబుతున్నారు. మొహమాటం లేకుండా సూటిగా మాట్లాడుతున్నారనీ తన పరిమితులు దాచుకునే ప్రయత్నం చేయడం లేదని కూడా వారు కితాబులిచ్చారు. తనపైన విమర్శలకు సమాధానం ఇవ్వడం సమర్థించుకోవడం గాక తన మాటలు చేతల ద్వారా పరోక్షంగా అవతలి వారే సమాధానం తెలుసుకోగలిగేట్టు చేయడంలో రాహుల్ ఫలప్రదమైనారని భారతీయ ఇంగ్లీషు పత్రికలు రాస్తున్నాయి. పైకి చెప్పకపోయినా తన గురించిన అపార్థాలు తొలగించి తనేమిటో చూపించుకోవడానికే ఆయన వెళ్లారని భావిస్తున్నారు. ఆ మేరకు ఆయన వారిని ఇంప్రెస్ చేసినట్టే లెక్క. మొదట్లో మోడీ వర్సెస్ రాహుల్ చర్చ అమెరికాలోనే మొదలైన సంగతి ఇప్పుడు గుర్తు చేయాలి.