పదేళ్ళపాటు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం ఉన్నప్పుడు ఏమి సాధించిందో అందరికీ తెలుసు. కనుక ఆ గొప్పదనం గురించి మళ్ళీ ఇప్పుడు స్మరించుకోనవసరం లేదు. ఆ పదేళ్ళ సమయంలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమి నేర్చుకొన్నా నేర్చుకోకపోయినా అనర్గళంగా లెక్చర్ ఇవ్వడం మాత్రం బాగా నేర్చుకొన్నారు. దానినే ఇప్పుడూ కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు లోక్ సభలో మళ్ళీ అలాంటి అవకాశమే దక్కడంతో మోడీ అంతటి వాడికి రాహుల్ గాంధి (పెద్దగా పరిజ్ఞానం అవసరం లేని) మత అసహనంపై అనర్గళంగా లెక్చర్ ఇచ్చేరు.
ఆయన ఏమన్నారంటే “ దేశంలో పెరిగిపోతున్న మత అసహనం గురించి నారాయణ మూర్తి, రఘురాం రాజన్, పి.ఎం. భార్గవ వంటివారు ఏమంటున్నారో మోడీగారు దయచేసి వినండి. వారి మాటలని విని వారికి గౌరవం ఇస్తే బాగుంటుంది. కోట్లాది మంది ప్రజల గొంతును వారు వినిపిస్తున్నారు. కానీ వారి నిరసనలు మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్దేశ్యపూర్వకంగా సృష్టించినవేనని మీరు వాదిస్తున్నారు. అంటే వారికి మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నడం తప్ప మరేపనులు లేవా?” అని ప్రశ్నించారు.
“ఇద్దరు దళిత బాలురని సజీవ దహనం చేస్తే, ఆ సంఘటనని మంత్రి వికె.సింగ్ కుక్కని రాయితో కొట్టడంతో పోల్చుతారు. అయినా మీరు ఆయనని మంత్రిగా ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. ఆ సంఘటనపై మీరు కూడా నోరు మెదపలేదు. రాజ్యాంగం అందరికీ సమానంగా రక్షణ కల్పించినప్పుడు వాళ్ళకి అన్యాయం జరిగితే మీరు ఎందుకు మౌనం వహించారు?” అని రాహుల్ ప్రశ్నించారు.
“మీరు పాకిస్తాన్ నుండి పాఠాలు నేర్చుకోవద్దు. అక్కడి ప్రభుత్వం ఎందుకు విఫలం అయ్యింది అంటే అక్కడి పాలకులు ప్రజల గొంతు వినబడకుండా అణచివేస్తున్నారు కనుకనే. అటువంటి వారి నుండి మీరు తప్పుడు పాఠాలు నేర్చుకోవద్దు. మన దేశ ప్రజల గొంతు వినండి. వారి కష్టాలను, సమస్యలను సానుభూతితో అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయండి,” అని రాహుల్ గాంధీ అన్నారు.
“మీరు అభివృద్ధి గురించి మాట్లాడుతుంటారు. కానీ మీ పార్టీ నేతలు మత అసహనం గురించి మాట్లాడిన అమీర్ ఖాన్ వంటివారిని పాకిస్తాన్ వెళ్ళిపొమ్మని హెచ్చరిస్తుంటారు. ప్రజలు స్వేచ్చగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు మనకు రాజ్యాంగం అవకాశం కల్పించింది. దానిని ప్రజలు వాడుకోనివ్వండి. పాకిస్తాన్ పాలకులలాగ ప్రజల గొంతులను అణచివేసే ప్రయత్నం మానుకోండి.” అని అన్నారు.
“మీరు గుజరాత్ ని పాలిస్తున్నపుడు రాజ్యాంగాన్ని ఏనుగు మీద పెట్టి ఊరేగించానని చెప్పుకొంటారు. కానీ దానిని ప్రజలకు అందుబాటులో ఉంచండి. మేము రాజ్యాంగాన్ని ఏనుగు మీద పెట్టి ఊరేగించమని చెప్పడం లేదు…కోరుకోవడం లేదు. దానిని అక్షరాల అమలు చేయాలని కోరుకొంటున్నాము,” అని రాహుల్ గాంధి అన్నారు.