బీజేపీని గెలిపిస్తున్న రాహుల్కు అభినందనలు అని కేటీఆర్ ఢిల్లీ ఎన్నికల ఫలితాలు రాగానే వెటకారమాడారు. ఇందులో ఆయన రేవంత్ రెడ్డిని కూడా కలుపుకున్నారు. అయితే కేటీఆర్ రాహుల్ విషయంలో చేసిన వెంటకారం మాత్రం పరిస్థితులతో పోల్చితే కరెక్టే అనుకోవచ్చు. పార్టీ పరిస్థితుల్ని మెరుగుపర్చేందుకు రాహుల్ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోగా.. మోదీతో పోటీ పడే విషయంలో ఆయన అసలు ముందుకు రావడం లేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రానురాను ఘోరంగా మారుతోంది.
ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క సీటు రాలేదు. ఇదే మొదటి సారి కాదు.. గత మూడు ఎన్నికలలోనూ రాలేదు. అంటే తుడిచిపెట్టుకుపోయిందన్నమాట. హర్యానాలో గెలవాల్సిన చోట ఓడిపోయారు. మహారాష్ట్రలో అన్యాయమైపోయామని గగ్గోలు పెట్టినా ప్రజలు సానుభూతి చూపించలేదు. తెలంగాణ కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గెలిపిస్తే ఆయన కాళ్లు, చేతులు ఆడకుండా చేసి.. స్వయం వినాశనం చేసుకుంటున్నారు. సొంత పార్టీ కార్యక్రమాల్లో రాహుల్ పాల్గొనేది చాలా తక్కువ. ఆయను కలవాలంటే కుదరదు.. ఆయన కలవాలనుకున్న వారినే కలుస్తారు.
ఓ వైపు మోదీ లాంటి దిగ్గజం ఉన్నారు. ఆయనను ఢీకొట్టాలంటే.. అంతకు మించి రాజకీయాలు చేయాలి.కానీ రాహుల్ కేవలం కులగణన … రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం అని రాజకీయాలు చేసుకుంటున్నారు. అదే ఓట్లు తెచ్చి పెడుతుందని అనుకుంటున్నారు. ప్రజలకు సెంటిమెంట్లుగా మారిన అంశాల్లోనూ ఆయన చొరవ చూపించడం లేదు. మహాకుంభమేళాలో పాల్గొనలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో కనిపించలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాహుల్ గాంధీ ప్రయారిటీలు ఏమిటో చాలా మందికి అర్థం కావు.