కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రాహుల్ గాంధి ప్రధానమంత్రి పదవి చేప్పట్టాలనుకొన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఓడిపోవడంతో కనీసం పార్టీ అధ్యక్ష పదవి కూడా చేపట్టలేకపోయారు. ఆయన దైర్యం చేసి పదవి చేపట్టాలనుకొంటే, పార్టీలో నేతలే ఆయనకు నాయకత్వ లక్షణాలు లేవని, పార్టీని సమర్ధంగా నడిపించే శక్తి ఆయనకు లేదని అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఆయన పార్టీ మీద అలిగి ‘రాజకీయాలకు శలవు’ పెట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టడానికి పార్టీలో ఎవరూ అభ్యంతరం చెప్పబోరనే హామీ ఇచ్చిన తరువాతనే మళ్ళీ ఆయన భారత్ తిరిగివచ్చినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ తిరిగివచ్చిన తరువాత ఆయన పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టలేదు. జమ్మూ కాశ్మీర్, బిహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలయితే ఆ అప్రదిష్ట ఆయనకు చుట్టుకోకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయనకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించకుండా సోనియా గాంధీ పదవీకాలం మరొక ఏడాది పొడిగించినట్లు మీడియాలో వార్తలు వచ్చేయి.
రెండు రాష్ట్రాలలో ఎన్నికలు పూర్తయ్యాయి. కానీ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించలేదు. రాహుల్ గాంధీ మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోయారు. ఆయన విదేశాలకు వెళ్ళగానే కాంగ్రెస్ పార్టీ నేతలు త్వరలోనే ఆయన తిరిగి వచ్చి పార్టీ పగ్గాలు చేపడతారని మీడియాకు చెప్పడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ అదే పరిస్థితి పునరావృతం అవుతున్నట్లు కనబడుతోంది. ఈఏడాది మే నెలలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పగించబడలేదని భావించవలసి ఉంటుంది. కానీ ఎన్నికలలో పార్టీ ఓడిపోతే ఆ అప్రదిష్ట రాహుల్ గాంధికి అంటుకోకూడదనుకొంటే ఇక ఆయన ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేరు. ఎందుకంటే దేశంలో ప్రతీ సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఏవో ఒక ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనుక ఈసారయినా రాహుల్ గాంధికి పార్టీ పగ్గాలు అప్పగించక తప్పదు.
అందుకే ఆయన మళ్ళీ విదేశాలకు వెళ్ళగానే కాంగ్రెస్ నేతలు ఈ విషయం గురించి మాట్లాడటం మొదలుపెట్టినట్లున్నారు. కానీ అదే మాటని వారు మరొక రకంగా చెప్పుకొంటున్నారు. పార్టీ పగ్గాలు చేపట్టడానికి రాహుల్ గాంధీ ఏమీ విముఖత చూపించడం లేదని చెపుతున్నారు.జనవరి 8 తరువాత ఆయన డిల్లీకి తిరిగి వస్తారు. వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించి ఆయనకు పార్టీ పగ్గాలు ఎప్పుడు అప్పగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని ఆ పార్టీ నేతలు చెపుతున్నారు. కానీ మళ్ళీ ఆఖరు నిమిషంలో తమిళనాడు ఎన్నికలు పూర్తయిన తరువాత ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించాలని నిర్ణయించినా ఆశ్చర్యమేమీ లేదు.