ఒకప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని భాజపా ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించాలనుకొన్నప్పుడు ఆ పార్టీలో అద్వానీ వంటి కొందరు సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. కారణాలు అందరికీ తెలిసినవే. అయితే మోడీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వారు కూడా ఆయనను వేరే కారణాలతో వ్యతిరేకించారే తప్ప ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవనే కారణంతో వ్యతిరేకించలేదు. పార్టీ లోపల, బయట తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటూనే నరేంద్ర మోడీ తన శక్తిసామర్ధ్యాలతో 2014 ఎన్నికలలో పార్టీకి విజయయం చేకూర్చిపెట్టి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తరువాత ఆయన ప్రభుత్వంపై, పార్టీపై కూడా పూర్తి పట్టు సాధించడం అందరూ చూస్తూనే ఉన్నారు.
కానీ రాహుల్ గాంధీకి ఆయన తల్లి సోనియా గాంధీ వడ్డించిన విస్తరిలాగ అన్నీ అమర్చిపెట్టినా కూడా అవకాశాలను అందిపుచ్చుకోలేకపోతున్నారు. ప్రధానమంత్రి పదవికి అర్హుడనని భావిస్తున్న ఆయనకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టడానికి కూడా అర్హుడుకాడని స్వంత పార్టీలో నేతలే విమర్శలు చేస్తుండటం విశేషం. ఆయన కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాలని ప్రయత్నించినప్పుడల్లా, ఆ పార్టీలో మొట్టమొదట జరిగే చర్చ దేనిపై అంటే ఆయన నాయకత్వ లక్షణాల గురించే! పార్టీలో సీనియర్లే కొంతమంది ఆయనకి అనుకూలంగా, మరి కొందరు వ్యతిరేకంగా అభిప్రాయలు వ్యక్తం చేస్తుంటారు.
నూరేళ్ళ పైబడిన చరిత్ర గల కాంగ్రెస్ పార్టీకి చాలా మంది గొప్ప గొప్ప నాయకులు అధ్యక్షులుగా వ్యవహరించారు. వారు కూడా వేరే విషయాలలో విమర్శలు ఎదుర్కొన్నారు కానీ వారి నాయకత్వ లక్షణాలపై సందేహాలు వ్యక్తం కాలేదు. చివరికి విదేశీ మహిళ అని విమర్శలు ఎదుర్కొంటున్న సోనియా గాంధీ నాయకత్వ లక్షణాల గురించి కూడా 2014 ఎన్నికల వరకు ఎన్నడూ ఎవరూ ప్రశ్నించలేదు. కానీ ఒక్క రాహుల్ గాంధీ విషయంలోనే ఆ ప్రశ్న మాటిమాటికి తలెత్తుతోంది. మరి అటువంటి వ్యక్తికే పార్టీ పగ్గాలు ఎందుకు అప్పజెప్పాలని సోనియా గాంధీ అనుకొంటున్నారు? అంటే పార్టీ భవిష్యత్ గురించి ఆలోచన కంటే పుత్రప్రేమ ఎక్కువైనందు వలన కావచ్చు లేదా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు తమ కుటుంబం చేతిలో నుంచి వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతే తమ ఉనికిని కోల్పోతామనే భయం వలన కావచ్చు. కారణాలు ఏవైనప్పటికీ, తన ముద్దుల కొడుకు కోసం కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ని పణంగా పెట్టడానికే ఆమె మొగ్గు చూపుతున్నారు.
వారిద్దరి చుట్టూ ఏర్పడిన కోటరీ నేతలు కూడా తమ రాజకీయ భవిష్యత్ గురించి ఆలోచించుకొంటూ ఆమెకే వంతపడుతున్నారు. దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ వంటి సీనియర్ నేతలు రాహుల్ గాంధీకి నాయకత్వ లక్షణాలున్నాయని సర్టిఫికెట్లు ఇవ్వవలసి వస్తోందంటేనే పరిస్థితి అర్ధం అవుతుంది. ఇటువంటప్పుడే ప్రధాని నరేంద్ర మోడీకి రాహుల్ గాంధీకి ఉన్న తేడా స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది.
రాహుల్ గాంధీకి పార్టీని నడిపించగల శక్తి సామర్ధ్యాలు లేని కారణంగానే అప్పుడప్పుడు ప్రియాంకా వాద్రా పేరు వినబడుతుంది. అది కూడా బయటి వ్యక్తుల నోటి నుంచి కాక కాంగ్రెస్ పార్టీ నేతలే ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే బాగుంటుందని సూచిస్తుంటారు. రాహుల్ గాంధీ సుమారు రెండు దశాబ్దాలుగా రాజకీయాలలో ఉన్నారు. ఎంపిగా ఉన్నారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. అయినప్పటికీ ఆయనని కాదని రాజకీయాలపై ఏమాత్రం ఆసక్తి చూపని ప్రియాంకా వాద్రాకి పార్టీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ నేతలు కోరుకోవడం గమనించిన తరువాతైనా రాహుల్ గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టాలనే తన ఆలోచనని విరమించుకొని, పార్టీలో వేరెవరికైనా అప్పగించేందుకు అంగీకరిస్తే ఆయనకీ, పార్టీకి కూడా మేలు జరిగేది. కానీ తన నెహ్రు కుటుంబ వారసత్వమే ప్రధాన అర్హతగా భావిస్తున్నందునే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడానికి తహతహలాడుతున్నారని భావించవచ్చు.
నిజానికి ఆయన తన శక్తి సామర్ధ్యాలని, నాయకత్వ లక్షణాలని నిరూపించుకొని ఉండి ఉంటే ప్రధానమంత్రి పదవే వచ్చి ఆయన ఒళ్లో వాలి ఉండేది. కానీ అందుకు తను అర్హుడనికానని ఆయన భావించినందునే నేడు ఈ దుస్థితి దాపురించిందని చెప్పక తప్పదు. ఒకవేళ ఆయన పార్టీ పగ్గాలు చేపడితే, అది కాంగ్రెస్ పార్టీకి కంటే భాజపాకే ఎక్కువ మేలు చేస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందుకే ఈ వ్యవహారంలో భాజపా నేతలు ఎవరూ నోరు మెదపడం లేదు.