” మనల్ని ప్రత్యేకంగా ఎవరూ నవ్వుల పాలు చేయాల్సిన పని లేదు ఎందుకంటే మనకు మనమే నవ్వుల పాలు చేసుకుంటాం కదా ” అన్నట్లుగా ఉంది వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీరు. తెలంగాణ టూర్‌కు వచ్చిన రాహుల్ గాంధీని కొంత మంది మీడియా ప్రముఖులు కలిశారు. దాన్ని పట్టుకుని .., మోడీదాకా తీసుకెళ్లి కథ అల్లేశారు విజయసాయి రెడ్డి. అందరూ కలిసి మోడీని ఎలా దించేద్దామా అని చర్చించారట. ఇందులోకి చంద్రబాబును తీసుకు రాకపోతే ట్వీట్‌కు అర్థమే ఉండదు కాబట్టి బ్యాక్ గ్రౌండ్ అంతా ఆయనే అన్నట్లుగా చెప్పుకొచ్చారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు పగలబడి నవ్వుతున్నారు. అందరూ ఒకటే ప్రశ్న అడుగుతున్నారు.. ” ఒక వేళ మోడీని దించేస్తానికి వాళ్లు మీటింగే పెట్టుకుంటే నీకేంటి బాధ..?” అని. దీనికి ఆయన దగ్గర సమాధానం ఉండదని .. ఇవ్వరని అందరికీ తెలుసు.
రాహుల్‌ను మీడియా ప్రతినిధులు కలిస్తే మోడీని దించడాకేనా!?
రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌కు వచ్చారు. పోరాడేందుకు జవసత్వాలు కూడగట్టుకునేందుకు ప్రయత్నిస్తూ..వాళ్లతో విడివిడిగా భేటీ అయ్యారు. కాంగ్రెస్‌కూ కాస్త కవరేజీ ఇచ్చేలా చూసుకునేందుకు మీడియా యాజమానులను కూడా పిలిచారు. వాళ్లు వీళ్లు అనే తేడా లేకుండా అందర్నీ పిలిచారు. చివరికి అసలు చానల్ ఎయిర్ అవుతుందో లేదో తెలియని సీవీఆర్ చానల్ ఓనర్ సీవీరావును కూడా పిలిచారు. ఇక రాధాకృష్ణ, రవిప్రకాష్‌లను పిలవకుండా ఉంటారా..? వారితో పాటు చాలా మంది తెలంగాణ మీడియా ప్రతినిధుల్ని పిలిచారు. అందరితోనూ నాలుగైదు సినిమాలు మాట్లాడి పంపించారు. ఇది ఓ రకంగా పరిచయాలు పెంచుకుని సాఫ్ట్ కార్నర్ ఏర్పాటు చేసుకోవడానికే తప్ప.. రాజకీయ వ్యూహాలు చర్చించేంత పెద్ద సమావేశాలు కాదు. ఆ విషయం రాహుల్ షెడ్యూల్ ను ఫాలో అయిన అందరికీ తెలుసు.
పట్టపగలు కలిస్తే అర్థరాత్రి అని చెప్పి “ఫాలో” అయ్యే వారిని బకరాల్ని చేస్తారా ?
అదే సమయంలో వీరు భేటీ అయింది పట్ట పగలు. మీడియా కెమెరాల ముందే. వారు భేటీ అయిన ఫోటోలు.. వీడియోలు మీడియాకు విడుదల చేశారు. రేవంత్ రెడ్డి చాలా మందిని దగ్గరుండితీసుకెళ్లి మళ్లీ తీసుకొచ్చారు. అదంతా మీడియాలో వచ్చింది. కానీ విజయసాయిరెడ్డి ఏదో సీక్రెట్ మీటింగ్ జరిగిపోయిందని చెప్పడానికి అర్థరాత్రి అంటూ తనదైన శైలిలో ట్వీట్ వేశారు. తాము చెప్పింది నమ్మే ఓ రకమైన వర్గాన్ని తయారు చేశామని వీరి గట్టి నమ్మకం కావొచ్చు. ప్రజల్ని అంత తేలికగా తీసుకోవడం ప్రారంభించి చాలా కాలం అయింది. విజయం చేతికందిన తర్వాత అది మరీ ఎక్కువైపోయింది.
మోడీ చల్లని చూపు కోసం ట్విట్ ప్రయాసలు !
అన్నింటికీ చంద్రబాబుకు లింక్ చేస్తే తప్ప.. తాము రాజకీయం చేయలేని స్థితికి చేరిపోయారు. ఏదో విధంగా మోడీకి బాకా ఊదకపోతే బయట ఉండలేని దుస్థితికి చేరిపోయారని అందుకే.. ప్రతీ చిన్న విషయానికి మోడీ మోడీ అంటూ కలవరిస్తున్నారని ఇతర పార్టీల నేతలు నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. రాహుల్ గాంధీ చైనాలో ఓ నైట్ క్లబ్లో ఉంటే చైనా రాయబారి హనీ ట్రాప్‌కు పడ్డారని ట్వీట్ చేశారు. విజయసాయి అపసోపాలు చూసి నెటిజన్లు కొంత మంది జాలి చూపిస్తున్నారు. చాలా మంది మాత్ర చేసిన పాపాలు ఇలాంటి కవరింగ్ల వల్ల పోవని..మళ్లీ జైలుకెళ్లడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం తన కోసం ఇతరలుపై ఎలాంటి బురద అయినా చల్లడానికి ఎప్పటికప్పుడు రెడీ అవుతూనే ఉన్నారు.