ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో జరిగిన తెలంగాణ పార్టీ నేతల భేటీ ముగిసింది. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరిగే వాతావరణం ఉండటం, ఇంకోపక్క మహా కూటమిలో భాగంగా పొత్తుల వ్యవహారమై ప్రధానంగా చర్చ జరగడంతో ఈ భేటీకి కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. టి. కాంగ్రెస్ కి చెందిన 40 మంది నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. అనంతరం సమావేశం వివరాలను పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాకి చెప్పారు. పెట్టుకోబోతున్న పొత్తుల అంశమై రాహుల్ కి వివరించామనీ, వాటిపై సానుకూలంగా స్పందించారన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉన్న సీట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారని చెప్పారు.
మీడియా ముందు ఎవరూ అనుచిత వ్యాఖ్యలు చెయ్యొద్దనీ, ఎంత పెద్ద నాయకులైనా అంశమై జాగ్రత్తగా ఉండాల్సిందేననీ, లేకుంటే పరిణామాలు వేరేగా ఉంటాయని స్పష్టంగా రాహుల్ చెప్పారన్నారు ఉత్తమ్! అందరూ కలిసి మెలిసి ఎన్నికల్లో గెలుపు దిశగా ప్రయత్నించాలని చెప్పారన్నారు. పార్టీలో ఎవరికి ఏది కావాలన్నా పీసీసీ అధ్యక్షుడు అందుబాటులో ఉంటారనీ, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ అందుబాటులో ఉంటారని నేతలకు రాహుల్ చెప్పారన్నారు. కాబట్టి, ఏ విషయమైనా బయట మాట్లాడొద్దని చెప్పారన్నారు. రాహుల్ వ్యాఖ్యలతో తెలంగాణ సీనియర్లకు కొత్త ఉత్సాహం వస్తుందనీ, హైదరాబాద్ తిరిగి వెళ్లి రాష్ట్రంలో పార్టీ గెలిచే వరకూ అందరూ పనిచేస్తారని ఆశిస్తున్నట్టు ఉత్తమ్ అభిప్రాయపడ్డారు!
భేటీ అనంతరం కోమటిరెడ్డి సోదరులు కూడా మీడియాతో మాట్లాడారు. సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటామనీ, ఎన్నికల వరకూ ఎవ్వరూ మాట్లాడొద్దని రాహుల్ చెప్పడం జరిగిందని కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. ఆయన చెప్పిన ప్రకారం గ్రూపులకు అతీతంగా పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు! అయితే, యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ చెప్పారని రాజగోపాల్ రెడ్డి చెప్పారు! గెలుపే లక్ష్యంగా యువతను ప్రోత్సహించాలని రాహుల్ చెప్పారు అన్నారాయన! ఈ సమావేశం తరువాత, అభ్యర్థుల ఎంపిక కోసం భక్త చరణ్ దాస్ అధ్యక్షతన ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశారు రాహుల్.
పార్టీలో ఏ అవసరమొచ్చినా పీసీసీ అధ్యక్షుడు, కుంతియాలను కలవాలని రాహుల్ సీనియర్లకు చెప్పారని ఉత్తమ్ అంటున్నారు! మీడియా మాట్లాడితే బాగోదు అని హెచ్చరించినట్టు చెప్పారు. కానీ, ఉత్తమ్ సోదరులేమో… యువతకు అవకాశం ఇవ్వాలీ, సీనియర్ల సలహాలూ సూచనలూ తీసుకుంటామని చెప్పారూ అంటున్నారు. సరే ఏదైతేనేం… పొత్తుల మీద స్పష్టత వచ్చినట్టే. అయితే, ‘కాంగ్రెస్ గెలిచే స్థానాలు వదులుకోవద్దు’ అనే పాయింట్ ని ఆచరణలో ఎలా అమలు చేస్తారో చూడాలి. ఎందుకంటే, పొత్తులో భాగంగా కొన్ని సీట్ల త్యాగం తప్పదు. దీంతోపాటు ఉత్తమ్ చెప్పినట్టు సీనియర్లలో కొత్త ఉత్సాహం ఏ స్థాయిలో వస్తుందో కూడా చూడాలి.