కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపులపై ఇంకా చర్చోపచర్చలు ఢిల్లీలో జరుగుతూనే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో రెండుసార్లు రాష్ట్ర నేతలు సమావేశమయ్యారు. ఈ రెండు మీటింగుల్లోనూ రాహుల్ అసంతృప్తికి గురైనట్టు సమాచారం. ముఖ్యంగా కూటమి అంశమై ఆయన స్పందిస్తూ…. రెండు నెలలు గడుస్తూ ఉన్నా ఇంకా మిత్రపక్షాలను సరైన దారిలోకి తీసుకుని రావడంలో విఫలమయ్యారంటూ రాష్ట్ర నేతలపై రాహుల్ గాంధీ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే… సోమవారం సాయంత్రమే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఆయన హుటాహుటిన బయల్దేరి వెళ్లారు. మరో నేత జానారెడ్డిని కూడా హైకమాండ్ పిలిచినట్టు సమాచారం. జానా రెడ్డి ఎందుకంటే… అసంతృప్తులను బుజ్జగించడంలో క్రియాశీలంగా వ్యవహరించే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని పిలిచారు.
ఇక, రేవంత్ విషయానికొస్తే… ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న సీట్ల కేటాయింపు ప్రక్రియపై ఆయన కొంత అసంతృప్తిగానే ఉన్నారనే కథనాలున్నాయి. రేవంత్ కాంగ్రెస్ లో చేరిన సమయంలో, ఆయనతోపాటు మరికొంతమంది కీలక నేతల్ని కూడా పార్టీలోకి తీసుకొచ్చారు. వారికీ పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని అధిష్టానాన్ని అప్పుడే కోరిన తరువాతే వారినీ తన వెంట తీసుకొచ్చారు. అయితే, ఇప్పుడు సీట్ల కేటాయింపు విషయానికి వచ్చేసరికి రేవంత్ సిఫార్సులు, డిమాండ్లకు ప్రాధాన్యత దక్కడం లేదు! రేవంత్ 10కిపైగా టిక్కెట్లు అడుగుతున్న పరిస్థితి. కానీ, ఆయన కోరినట్టుగా టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదు! దీంతో ఈ మధ్య ఆయన కాస్త అసంతృప్తికి గురైనట్టు సమాచారం.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ కోరుతున్న నంబర్ ప్రకారం సీట్లు ఇవ్వలేమనీ, సమీప భవిష్యత్తులో ఆయన సిఫార్సు చేసినవారిందరికీ ఇతర పదవులు పంపకాల్లో ప్రాధాన్యత ఉంటుందనే భరోసా కల్పించబోతున్నారు. అందుకే, ఆయన్ని హుటాహుటిన ఢిల్లీకి రమ్మన్నట్టు సమాచారం. మొత్తానికి, సోమవారం రాత్రికే సీట్ల కేటాయింపులు, ప్రముఖ నేతల అలకల తీర్చడాలు, భవిష్యత్తుపై హామీలు ఇవ్వడాలు… ఇలాంటివన్నీ ముసిగిపోవాలని పార్టీ హైకమాండ్ లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తోంది.