గత 18ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న సోనియా గాంధీ పదవీకాలం ఈరోజుతో ముగుస్తుంది. ఇంత కాలంగా పార్టీ పగ్గాలు చేప్పట్టాలని చాలా ఆత్రుతపడిన ఆమె కుమారుడు రాహుల్ గాంధీ వెనుకంజ వేయడంతో ఆమె పదవీ కాలాన్ని మరొక ఏడాది పొడిగిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కోసం ప్రధాన మంత్రి కుర్చీని పదేళ్ళ పాటు రిజర్వు చేసి ఉంచారు. ఆయన ప్రధాన మంత్రి పదవిని చేప్పట్టి ఉండి ఉంటే, కాంగ్రెస్ పార్టీలో అతిరధ మహారధులు వంటి నేతలు అందరూ ఆయనకు అండగా నిలబడి ఉండేవారు. కానీ ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొనే సాహసం చేయకపోవడంతో రాహుల్ గాంధీ చేజేతులా ఒక సువర్ణావకాశాన్ని జారవిడుచుకొన్నారు.
మళ్ళీ ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేప్పట్టే అవకాశాన్ని కూడా జారవిడుచుకొన్నారు. అధ్యక్ష భాద్యతలు చేప్పట్టేందుకు రాహుల్ గాంధీ మరొక ఏడాది సమయం కోరినట్లు కాంగ్రెస్ చెపుతోంది. కానీ ఇంత వరకు ఏమీ సాధించలేని రాహుల్ గాంధీ మరొక ఏడాది తరువాత మాత్రం ఏమి సాధిస్తారు? అని ప్రశ్నించుకొంటే ఏమీ ఉండబోదనే సమాధానం వస్తుంది. మరి అటువంటప్పుడు మరొక ఏడాది సమయం ఎందుకు? అంటే బహుశః వచ్చే నెలలో జరుగబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఘోర పరాజయం పొందినట్లయితే ఆ అపవాదు, అప్రదిష్ట కూడా రాహుల్ గాంధీకి చుట్టుకోకూడదనే ఆలోచనతోనే ఆయనకి అధ్యక్ష బాధ్యతల నుండి దూరంగా ఉంచి ఉండవచ్చును.
ఒకవేళ బీహార్ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ ఘోర పరాజయం పొందినా ఆ అపకీర్తి సోనియా గాంధీకే ఆపాదించబడుతుంది తప్ప రాహుల్ కి అంటదు. అదే నిజమయితే కోడిపెట్ట తన పిల్లలను రెక్కల క్రింద దాచుకొని ఏవిధంగా కాపాడుకొంటుందో అదే విధంగా సోనియా గాంధీ కూడా తన ముద్దుల కొడుకు రాహుల్ గాంధీని కాపాడుకొంటున్నారని భావించాల్సి ఉంటుంది. కానీ ఏకంగా దేశాన్నే ఏలానుకొంటున్న వ్యక్తి ఇంకా తల్లి చాటు బిడ్డలా వ్యవహరిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తుంది. రెండు నెలలు విదేశాలలో ‘చార్జింగ్’ చేసుకొని వచ్చిన తరువాత రాహుల్ గాంధీ చాలా దైర్యంగా మోడీ ప్రభుత్వాన్ని ‘డ్డీ’ కొంటున్నప్పుడు, ఈ బీహార్ ఎన్నికలలో కూడా ఆయనను డ్డీకొని ఉంటే కాంగ్రెస్ ఓడినా అందరూ ఆయనను మెచ్చుకొనేవారు. రాహుల్ గాంధీ తన రాజకీయ చతురత, నాయకత్వ లక్షణాలు ప్రదర్శించుకొనేందుకు బీహార్ ఎన్నికలు మరొక గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కానీ ఆయన మళ్ళీ భయపడి వెనక్కి తగ్గారు.
ఆయనకి కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ అండగా ఉన్నా పోరాడేందుకు భయపడుతున్నారు. కానీ నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మోడీని ప్రధాని అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించిన తరువాత ఆయన తీవ్ర ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ఏవిధంగా ఒంటరిగా పోరాడి నెగ్గుకువచ్చారో అందరూ చూసారు. నిజమయిన నాయకుడు ప్రతికూల పరిస్థితులనే తన ప్రతిభ, నాయకత్వ లక్షాణాలు ప్రదర్శించుకొనేందుకు వచ్చిన అవకాశంగా భావిస్తాడని మోడీ రుజువు చేస్తే, నాయకత్వ లక్షాణాలు లేని రాహుల్ గాంధీ చేతికి అంది వచ్చిన అవకాశాలను వదులుకోవడమే కాకుండా ఇటువంటి అగ్ని పరీక్షలు ఎదురయినప్పుడు తల్లి కొంగు చాటున దాక్కొంటున్నారు.