చావులోనూ ఓట్ల వేట సాగించడం కొందరు రాజకీయ నాయకులకు బాగా అలవాటు. ఈ కళలో ఆరితేరడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా యధాశక్తి ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. కేరళలో దళిత యువతిపై దారుణ అత్యాచారం, హత్య ఘటనపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు చూస్తే, ఆయనకు ఓట్లు తప్ప మరేమీ పట్టదన్న బీజేపీ విమర్శలు అబద్ధం కాదని అనిపిస్తుంది.
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య వార్త తెలిసిన కొన్ని గంటల్లోనే రాహుల్ గాంధీ ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో వాలిపోయారు. నేరుగా హెచ్ సి యు కు వెళ్లి, కొందరు విద్యార్థులతో గొంతు కలిపారు. బీజేపీ మీద, కేంద్రం మీద, మంత్రుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. రోహిత్ సూసైడ్ నోట్ లో లేని పేర్లను ప్రస్తావిస్తూ బీజేపీ వాళ్లే హంతకులన్నట్టు తీవ్రమైన పదజాలంతో ప్రసంగాలు చేశారు.
ఒక విద్యార్థిపై దాడి చేశాడనే ఆరోపణపై రోహిత్ మీద క్రమశిక్షణ చర్య తీసుకున్నారు. తర్వాతి పరిణామ క్రమంలో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి దారితీసిన పరిణామాలు ఏమిటనేది విచారణలో తేలుతుంది. కానీ రాహుల్ గాంధీకి అంత ఓపిక కూడా లేకపోయింది. దళితుల ఓటు బ్యాంకును సుస్థిరం చేసుకోవడానికి ఆ యువకుడి చావు ఓ సాధనంగా ఉపయోగపడుతుందని యువనేత భావించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది.
ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఉగ్రవాదులను అమరవీరులని కీర్తిస్తూ కొందరు విద్యార్థులు కల్చరల్ ఈవెంట్ నిర్వహంచారు. వారిపై యూనివర్సిటీ చర్యలు తీసుకుంటే రాహుల్ గాంధీ రగిలిపోయారు. జాతివ్యతిరేక శక్తులకు అండగా నిలబడ్డారు. హుటాహుటిన క్యాంపస్ కు తరలివెళ్లారు. మీ గొంతు నొక్కే ప్రయత్నం జరుగుతోంది, మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అంతటి పెద్ద పార్టీ ఉపాధ్యక్షుడే అంత బాహాటంగా మద్దతు ప్రకటించినప్పుడు ఏం చేసినా చెల్లుతుందని విద్యార్థులు అనుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.
కేరళలో ఆరు రోజుల క్రితం ఓ దారుణం జరిగింది. న్యాయశాస్త్రం చదువుతున్న ఓ దళిత యువతిపై నిర్హయ తరహాలో అత్యాచారం చేశారు. రాక్షసంగా హింసించారు. ఆమె అవయవాలన్నీ చితికపోయేలా చిత్రహింసలు పెట్టారు. దుండగుల పైశాచికానికి ఆ యువతి బలైపోయింది. తన ఇంట్లోనే శవమై కనిపించింది. ఇంతటి దారుణంపై కేరళ భగ్గుమంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ, పోలీసుల వైఫల్యంపై దుమ్మెత్త పోస్తున్నారు. ఆరురోజులైనా నిందితులను పట్టుకోలేదని నిలదీస్తున్నారు.
ఇంత జరుగుతున్నా రాహుల్ గాంధీకి కేరళ వెళ్లడానికి సమయం దొరకలేదు. కనీసం ఈ ఘటనపై స్పందించడానికి కూడా వీలు చిక్కలేదు. మంగళవారం మధ్యాహ్నం నుంచి పలువురు జర్నలిస్టులు ఆయన స్పందన కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మరోవైపు, బీజేపీ నేరుగా రాహుల్ పైనే విమర్శలు ఎక్కుపెట్టింది. హైదరాబాద్, జెఎన్ యు వెళ్లడానికి సమయం ఉంది. కేరళ వెళ్లడానికి సమయం లేదా అని ప్రశ్నించింది. దీంతో, విషయం అర్థమై ఉంటుంది. ఇప్పటికైనా స్పందించక పోతే బాగుందడని ఆయన భావించినట్టున్నారు. అయితే ఇంతకు ముందు పలు ఘటనలు జరిగినప్పుడు మీడియా ముందు వీరోచిత వ్యాఖ్యలు చేశారు. కేరళ విషయంలో మాత్రం ఇంట్లో కూర్చుని ట్విటర్ ను ఆశ్రయించారు.
జరిగిన దారుణ ఘటన తనకెంతో బాధ కలిగించిందని ఓ ట్వీట్ పోస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్య తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. అంతేగానీ కేరళ వెళ్లడం గానీ కనీసం మీడియా ముందుకు రావడం గానీ చేయలేదు. ఇదే, రాజకీయ ప్రత్యర్థులకు బ్రహ్మాస్త్రంగా మారింది.