త్రేతాయుగం నుంచి ప్రస్తుత కలియుగం దాకా పాదయాత్ర చేసినవాడు ఎప్పుడూ చెడిపోలేదు. ఆధ్యాత్మిక చింతనతో చేసినా, రాజకీయ ఉద్దేశంతో సాగించినా, జ్ఞాన సముపార్జన కోసం అడుగులు వేసినా సత్ఫలితాలే వస్తాయని ఇతిహాసాలతోపాటుగా చరిత్ర చెబుతున్న సత్యం.
ఈరోజున రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తుంటే ఎవరో కొందరు గిట్టనివారు విమర్శించవచ్చు. `ఏమిటీ ఈయన పాదయాత్రచేసేసి పుణ్యఫలమంతా ఒక్కసారిగా దక్కించుకోవాలని అనుకుంటున్నారా ?’ అంటూ ఏద్దేవా చేయవచ్చు.
పాదయాత్ర మహత్య్మం తెలియనివారు ఇలాగే ఈసడించుకుంటారు. రాహుల్ కు ఏం తక్కువైందట ? ఎఐసీసీ ఉపాధ్యక్షుడు, పైగా ప్రజలతో మమేకమైపోవాలనుకుంటున్నవాడు. అలా అనుకోవడం ఇలా పాదయాత్ర చేయడం తప్పేమీకాదే..
పూర్వం కాశీయాత్ర ఓపెద్ద పాదయాత్రలా సాగేది. ఆ యాత్రసమయంలోనే అనేక బంధనాలు ఏర్పడేవి. బ్రహ్మచారికాస్తా సంసారిగా మారి ఇంటికి వచ్చేవాడు. అందుకే హిందూవివాహ తంతులో కాశీయాత్ర అనబడే పాదయాత్ర విశిష్టతను సంతరించుకుంది. అంటే దీని అర్థమేమిటి? పాదయాత్ర వల్ల కొత్త బంధనాలు తగులుకుంటాయనేగా. పాదయాత్ర చేసినవాళ్లను ఎవరిని అడిగినా తమకు ఫలానా ఊర్లో, ఫలానా ప్రాంతంలో మంచి ఫ్రండ్స్ ఉన్నారనీ, పాదయాత్ర కారణంగా ప్రాణస్నేహితులు ఏర్పడ్డారని చెబుతుంటారు.
మీకు ఎవిడెన్స్ కావాలి… అంతేగా. ఒక్కసారి త్రేతాయుగానికి వెళ్దాం. పాదయాత్రల్లో ఆధ్యుడు రాముడేనేమో. ఎక్కడ అయోధ్య, మరెక్కడ రామేశ్వరం. మధ్యలో పర్వాతాలు, లోయలు, కారడవులు, ఇసుక తెన్నెలు, నదీనదాలు…ఒకటేమిటీ ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ తన పాదయాత్రను అలుపూసొలుపూ లేకుండా చేసిన మహానుభావుడు రాముడు. చేతికొస్తుందనుకున్న రాజ్యం పుటుక్కున చేజారిపోయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా వనవాసం పేరిట పాదయాత్రకు శ్రీకారం చుట్టాడు రాముడు. అప్పటి నుంచి నడకను కొనసాగిస్తూనే మధ్యలో అనేక మంది మిత్రులను, అభిమానులను, సేనలను సిద్ధం చేసుకున్నాడు. విషాదం అలుముకున్నప్పుడు, పదవి చేజారిపోయినప్పుడు తప్పనిసరిగా చేయాల్సింది పాదయాత్రేనని శ్రీరామచంద్రుడే స్వయంగా చేసిచూపించాడు. నేటి పాదయాత్ర మహామహులకు నాటి శ్రీరాముడే ఆదర్శపురుషుడు. వనవాసం మధ్యలో విలన్ రావణుడు తన భార్యను ఎత్తుకెళ్ళిపోతే తన పాదయాత్ర బలగాన్ని (పాదయాత్రవల్ల వనకూడిన మిత్ర బలగాన్ని) అడ్డంగాపెట్టుకుని సముద్రంమీద వారధి కట్టించి యుద్ధంచేసి (బలగంచేత చేయించి) విలన్ రావణుడ్ని మట్టుపెట్టించి తన భార్యను అయోధ్యకు తీసుకురాగలిగాడు రాముడు. అంతేనా, పరమ భక్తాగ్రేశరుడైనటువంటి ఆంజనేయులవారిని తన బంటుగా (శ్రీరామ బంటుగా) మలుచుకోగలిగాడు.
అసలు పాదయాత్ర చేయాలనుకునేవారు, సంకల్పం చెప్పుకునేవారు ముందుగా చేయాల్సిన పనేమిటంటే, రామాయణం చదవడం. శ్రీరాముడు మహాసామ్రాజ్యాన్ని ఎలా స్థాపించగలిగారో, మహానాయకునిగా ఎలా ఎదగాలో తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే. పాదయాత్ర (దీన్నే వనవాసం అని అన్నారప్పుడు) చేస్తూ రాముడు అనేక చిన్నచిన్న సమాజాలతో మైత్రీబంధం ఏర్పాటుచేసుకున్నాడు. ఉదాహరణకు .. గుహుడి నాయకత్వంలోని సమాజాం. గుహుడు కేవలం పడవనడపుకునేవాడేకాదు, అతను ఆ ప్రాంత వాసులకు నాయకుడు. గుహుడితో స్నేహబంధం చేయడంవల్ల ఆ ప్రాంతమంతా శ్రీరాముడికి మిత్రరాజ్యంగా మారిపోయింది. అలాగే, శబరి నివసించే ప్రాంతం, ఆపైన వానరులు నివసించే రాజ్యం, చివరకు సముద్రానికి ఆవల ఉన్న లంకారాజ్యంలోని విభీషణుడ్ని మిత్రునిగా స్వీకరించడంతో ఆ రాజ్యం కూడా శ్రీరాముని మహాసామ్రాజ్యానికి మిత్రరాజ్యాలుగా మారిపోయాయి. ఇదంతా ఎలా సాధ్యమైందంటారు, మహాపాదయాత్ర వల్లనే.
త్రేతాయుగం కథలు మాకెందుకు సార్, ఇప్పుడు ఈ మధ్య పాదయాత్ర మహిమతో పాలనా పగ్గాలు అందుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా ? ఉంటే చెప్పండి …అని మీరు అడగొచ్చు. సరే ఆ ముచ్చటా చెబుతాను…
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పాలనను దింపేసి కాంగ్రెస్ పాలనను తెలుగునాట స్థాపించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డిగారి పాదయాత్రే కారణం. ఆయన కాళ్లు నొప్పులుపుట్టేలా, పాదాలు వాచిపోయేలా ఆమూల నుంచి ఈమూల వరకు పాదయాత్ర చేయడంతో సకల జనుల కష్టాలు అర్థమయ్యాయి. పాలకుల లోపాలు తెలిసిపోయాయి. దీంతో ప్రజలతో మమేకమయ్యారు. మైత్రీబంధంతో ముందుకు సాగారు. ఫలితంగా మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ రాజ్యం వచ్చేసింది.
అదే ఫార్ములాతో చంద్రబాబు కూడా పాదయాత్రచేసి (మీకోసమంటూ) చివరకు సత్ఫలితాలనే అందుకున్నారు. ఆమాటకొస్తే, వైఎస్సార్ తనయుడు, పట్టుదలకు మారుపేరైన జగన్మోహన్ రెడ్డి (జగన్) ఓదార్పు యాత్రలను కంటిన్యూచేస్తూ ప్రత్యేక ట్రెండ్ (రికార్డ్) సృష్టిస్తూనే ఉన్నారు.
వీళ్లంతా పాదయాత్రలు చేసినప్పుడు విమర్శంచనివాళ్లు రాహుల్ చేస్తే `ఇప్పుడు ఈయనకెందుకు పాదయాత్ర’ అంటూ తీసిపారేస్తారా ! ఈ వరుస బాగోలేదు. అసలు రాహుల్ అంతటి గొప్పింటి బిడ్డ, ఎండావాన తెలియని సుకుమారుడు ఇప్పుడు గడ్డంపెంచేసి రోడ్డెక్కి పాదయాత్ర చేస్తుంటే ఆ సీరియస్ నెస్ అర్థంచేసుకోకుండా విమర్శలు చేయడం భావ్యంకాదు.
కేవలం 10 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తేనే పుణ్యఫలం వచ్చేస్తుందా? అంటూ మరికొందరి వాదన.` ప్రతివాడూ రాముడిలాగా వేలకువేల కీలోమీటర్లు పాదయాత్రలు చేయడం కుదురుతుందా చెప్పండి. చిత్తశుద్ధితో దేవుడికి త్రుణమో, ఫణమో ఇస్తే ఆ దేవుడు కరుణించడంలేదూ..’ అలాగే అనుకోవాలంటారు కొందరు. అయితే ఒక్కటి మాత్రం నిజం, జనదేవుళ్లు అంత ఉదారవాదులు కారు. పది కిలోమీటర్ల పాదయాత్ర చేస్తే దానికి తగ్గట్టుగానే ఫలితం అందజేస్తారు. కిలోమీటర్ నడిచి కలకాలం రాజ్యపాలన పగ్గాలు అందుకోవాలంటే కుదరదని చెప్పడంలో వీళ్లు మొనగాళ్లు. మరి ఆ విషయం రాహుల్ కి అర్థమైందో లేదో…
– కణ్వస
kanvasa19@gmail.com