ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అంటే అందరికీ సమాన హక్కులు ఉంటాయని అనుకుంటారు. కానీ మన దేశం అలాంటి పరిస్థితిని ఎప్పుడో దాటిపోయింది. అధికారంలో ఎవరు ఉంటారో వారికి ఎక్కువ హక్కులు ఉంటాయి. కాకపోతే అవి ఎలా అనుభవిస్తారంటే.. ఇతరులకు ఆ హక్కులు లభించకుండా చేయడం ద్వారా. ఎన్నికల నిర్వహణలో ఎన్నో విమర్శలు వస్తున్నా.. ఈ తీరు మాత్రం మారడం లేదు. తాజా ఉదాహరణ కాంగ్రెస్ పార్టీకి ఒక్క రూపాయి నిధులు అందకుండా చేసి ఎన్నికలకు వెళ్లడం.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రెస్ మీట్ పెట్టారు. తమ పార్టీ ఎంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటుందో వివరించారు. ఐటీ శాఖ కాంగ్రెస్ ఖాతాల్ని స్తంభింప చేసింది. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయనివ్వడం లేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. పార్టీ నేతలు ఒక చోట నుంచి మరో చోటకు వెళ్లడానికి ఇబ్బందులు పడుతున్నారు. అభ్యర్థులకు ఎలాంటి సాయం చేయలేకపోతున్నారు. ఇదే విషయాన్ని చెప్పిన రాహుల్ గాంధీ దేశంలో ఎన్ని వ్యవ్థలు ఉన్నా.. ఒక్కటి కూడా ప్రతిపక్ష పార్టీ హక్కులను కాపాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఖాతాల్ని ఫ్రీజ్ చేయడం కన్నా కుట్ర ఏమీ ఉండదు. ఎందుకంటే ఎలక్టోరల్ బాండ్ల పేరుతో దేశాన్ని నిలువుదోపిడీ చేశారని ఓ వైపు అనేక విమర్శలు వస్తున్న సమయంలో.. అలాంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేదు.. కానీ ఎప్పుడో… ఇన్ కం ట్యాక్స్ రిటర్న్స్ ఆలస్యంగా దాఖలు చేశారని కాంగ్రెస్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. నిజానికి కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది తమకు అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి చాలా పార్టీలు సామంతులుగా మారిపోతున్నాయి. అందుకే కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచేవారూ తగ్గిపోతున్నారు.
అందుకే ఈ సారి కాంగ్రెస్ గెలవకపోతే.. ప్రజాస్వామ్యం ఉండదని కాంగ్రెస్ నేతలు వాపోతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏదైనా ప్రజలే నిర్ణేతలు.