కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వృద్ధాప్య పెన్షన్లు రూ. నాలుగు వేలు చేస్తామని రాహుల్ గాంధీ ఖమ్మం వేదికగా హామీ ఇచ్చారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరేందుకు ఏర్పాటు చేసిన సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత రాష్ట్ర సమితిని పూర్తి స్థాయిలో టార్గెట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్లను పూర్తి స్థాయిలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కర్ణాటకలో అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింంచామని.. తెలంగాణలోనూ అదే పని చేస్తామన్నారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీతో కలిసిపోయిందన్నారు. బీఆర్ఎస్ అంటే బీజేపీ రిస్తేదార్ కమిటీ అనే అర్థం చెప్పారు.
ధరణి ద్వారా సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున భూముల దోపిడీకి పాల్పడ్డారని.. ఆ భూములన్నీ ఆయనవి కావని. మీవేనని ప్రజలను ఉద్దేశించి అన్నారు. తాము రాగానే ధరణిని రద్దు చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్తో పొత్తు ఉండే అవకాశమే లేదని రాహుల్ తేల్చి చెప్పారు. విపక్షాల భేటీకి బీఆర్ఎస్ ను పిలిస్తే తాము రాబోమని చెప్పామన్నారు. బీఆర్ఎస్ వేధింపులను ఎదుర్కొని కాంగ్రెస్ నేతలంతా పోరాడుతున్నారని.. .. కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. కేసీఆర్ స్కాములన్నీ మోదీ ఏజెన్సీలకు తెలుసని అయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. తెలంగాణ బీజేపీ బీ టీమ్‌ను ఓడిస్తామన్నారు.
రాహుల్ గాంధీ ప్రసంగం సూటిగా క్లుప్తంగా సాగింది. సభ విజయవంతానికి నేతలంతా ప్రతిష్టాత్మకంగా ప్రయత్నించారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోయినా… ఇతర వాహనాలు ఇవ్వడానికి ప్రైవేటు ఆపరేటర్లు భయపడినా పెద్ద ఎత్తున జన సమీకరణ చేయగలిగారు. ఈ సభతో కాంగ్రెస్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది.