తిరమల వెంకన్న లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయ్యిందని, అందులో జంతువుల కొవ్వు అవశేషాలున్నట్లు తేలటంపై సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది.
తాజాగా ఈ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. తిరుపతి బాలాజీ అంటే ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది పూజించే దేవుడు. శ్రీవారి ప్రసాదం అపవిత్రమైందన్న వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది ప్రతి భక్తుడిని బాధపెడుతోంది. తిరుమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాల పవిత్రత కాపాడాల్సిన అవసరం ఉంది అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
ఇదే విషయంపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సైతం సీఎం చంద్రబాబుతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని, ఎంతో పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై చర్యలు తీసుకోవటంతో పాటు భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన సూచించారు.
ఇక దీనిపై కేంద్ర ఇంటలిజెన్స్ వర్గాలు కూడా ఫోకస్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.