సార్వత్రిక ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఘన విజయం సాధించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని ఎంచుకుంటారు, ఏ స్థానానికి రాజీనామా చేస్తారు అనేది ఆసక్తి రేపుతోంది.
యూపీలో రాయ్ బరేలీ , కేరళలో వయనాడ్ ఎంపీ స్థానాల నుంచి బరిలో నిలిచిన రాహుల్ గాంధీ బంపర్ మెజార్టీతో విజయం సాధించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం రెండింట్లో ఏదో ఒక స్థానం నుంచి మాత్రమే ఎంపీగా ప్రాతినిధ్యం వహించాల్సి ఉండటంతో రాహుల్ తమ ఫ్యామిలీకి కంచుకోట అయిన రాయ్ బరేలీని ఎంచుకుంటారా..? లేక ప్రతికూల పరిస్థితుల్లో తనను ఆదరించిన వయనాడ్ వైపు మొగ్గు చూపుతారా..? అనే బిగ్ డిబేట్ గా మారింది.
రెండు స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికల ఫలితాలు వెల్లడైన రెండు వారాల్లోపు తాము ఏ స్థానాన్ని సెలక్ట్ చేసుకుంటామనేది స్పీకర్ కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే నిబంధనల ప్రకారం గెలిచిన రెండు చోట్ల అనర్హత వేటు పడుతుంది. దీంతో ఈ నెల 18లోపు రాహుల్ గాంధీ తాను గెలిచిన రెండు నియోజకవర్గాల్లో ఎదో ఒక దానిని ఎంపిక చేసుకొని స్పీకర్ కు సమాచారం అందించాల్సి ఉంది.