ఇన్నాళ్లుకు వైకాపా విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. కాకపోతే, చాలా ఆలస్యంగా స్పందించారని చెప్పాలి. పీసీసీ అధ్యక్షుడు ఉమెన్ చాందీతోపాటు ఏపీకి చెందిన నేతలతో రాహుల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసే వ్యూహం గురించి చర్చించారు. ఈ సందర్భంగా జగన్ పై గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు అని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరుపేదల కోసం ఆలోచిస్తుందనీ, వైయస్సార్ పాలన కూడా పేదల సంక్షేమం అనే లక్ష్యంతోనే సాగిందన్నారు. కానీ, జగన్ అలా కాదనీ, ఆయన వ్యక్తిగత లక్ష్యలతోనే రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. వైయస్ పేదల కోసం పోరాటాలు చేస్తే, జగన్ కేవలం తనకోసం మాత్రమే పోరాటాలు చేసుకుంటున్నారని చెప్పారు.
ప్రస్తుతం వైకాపాలో చాలామంది ఇమడలేకపోతున్నారనీ, వారిలో కాంగ్రెస్ స్వభావం ఉన్నవారే ఎక్కువ అని అన్నారు. అలాంటి నేతల్ని తిరిగి కాంగ్రెస్ లోకి ఆహ్వానించాలనీ, వైకాపాలో స్వేచ్ఛ ఉండదనీ, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వెసులుబాటును వారికి వివరించే ప్రయత్నం చేయాలిన దిశా నిర్దేశం చేశారు. ఇకపై వైకాపాని ప్రధానంగా చేసుకుని రాజకీయ దాడి మొదలుపెట్టాలని రాష్ట్ర నేతలకు సూచించారు. రాజశేఖర్ రెడ్డి కుమారుడు జగన్ అనే కారణంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆయన విషయంలో మెతక వైఖరి వ్యవహరిస్తున్నారనీ, అలాంటి అభిప్రాయాలు మనసులోంచి తీసెయ్యాలని రాహుల్ స్పష్టం చేశారు.
ఇన్నాళ్లకు కాంగ్రెస్ సరైన వ్యూహంతో సిద్ధమౌతోందని చెప్పుకోవచ్చు. ఈ పని గడచిన నాలుగేళ్లుగా చేసి ఉంటే.. కాంగ్రెస్ కొంత ఊపైనా వచ్చి ఉండేది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చాలా భాగం వైకాపాకి కన్వర్ట్ అయింది. వాస్తవం ఏంటంటే, ఆంధ్రాలో క్షేత్రస్థాయిలో తెలుగుదేశం తరువాత బలమైన మూలాలు ఉన్న పార్టీ కాంగ్రెస్ మాత్రమే. విభజన తరువాత రాష్ట్రంలో నాయకత్వ లోపమే కాంగ్రెస్ కు శాపంగా మారింది. పేరున్న నేతలు లేకపోవడం, ఉన్నవారు ఇతరపార్టీలకు వలస వెళ్లడం, హైకమాండ్ కూడా సీరియస్ గా తీసుకోకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి సమస్యగానే మారింది. వైయస్సార్ లెగసీని కూడా కాంగ్రెస్ వాడుకోలేకపోయింది. వైయస్సార్ పాలనను వైకాపా పాలనగా జగన్ ప్రచారం చేసుకుంటున్నారు. నిజానికి, వైకాపాకి గతం అంటూ ఎక్కడుంది..? అదంతా కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కదా! కనీసం ఇప్పటికైనా జగన్ విషయమై రాహుల్ ఒక స్పష్టతకి రావడం, వైకాపా లక్ష్యంగా పోరాటాలు చేస్తామని చెప్పడంతో ఏపీ కాంగ్రెస్ కి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంటుందేమో చూడాలి.