హైదరాబాద్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఇవాళ అనంతపురంజిల్లాలో పర్యటించారు. మహాత్మాగాంధి పనికి ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి నేటితో పదేళ్ళవుతున్న సందర్భంగా నాడు ఆ పథకాన్ని ప్రారంభంచిన అనంతపురంజిల్లా బండ్లపల్లికి వారిద్దరూ వెళ్ళారు. అక్కడ ఉపాధి హామీ కూలీలు, ఫీల్డ్ అసిస్టెంట్లతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో రాహుల్ పాల్గొన్నారు. పథకం ఎలా అమలవుతోంది, ఎలా లబ్ది పొందుతున్నారనే విషయాలను రాహుల్ తెలుసుకున్నారు. తర్వాత కూలీలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. తర్వాత అక్కడ జరిగిన బహిరంగసభలో రాహుల్, మన్మోహన్ మాట్లాడారు.
మహాత్మాగాంధి ఆశయాల మేరకు ఉపాధిహామీ పథకాన్ని నాడు ప్రవేశపెట్టామని రాహుల్ చెప్పారు. దీనివలన కోట్లమంది పేదరికంనుంచి బయటపడ్డారని అన్నారు. ఐక్యరాజ్యసమితికూడా ఈ పథకాన్ని ప్రశంసించిందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చింది యూపీఏ కూటమి కాదని, భారత ప్రభుత్వమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత ప్రధాని నరేంద్రమోడిపైనే ఉందని, మోడికి ఈ విషయం తెలియదా అని అడిగారు. ఒక రాష్ట్రానికి కేంద్రం హామీ ఇచ్చి నిలబెట్టుకోలేకపోవటం ఇదే మొదటిసారని రాహుల్ అన్నారు.