“కాంగ్రెస్ గెలిస్తే నేనే ప్రధాని “..ఈ మాట నాలుగేళ్ల కిందట రాహుల్ గాంధీ మీడియాతో అని ఉంటే… ” పప్పు బన్ గయా పీఎం” అని సోషల్ మీడియాలో ట్రోలింగ్ వెల్లువెత్తేది. నిన్నామొన్నటి పప్పు అని అవహేళన చేసిన వారు కూడా ఇప్పుడు… ఆ మాట అనలేకపోతున్నారు. రాహల్ ట్రాన్స్ఫర్మేషన్ నాలుగేళ్లలో అంతగా మారిపోయింది. 2014 సాధారణ ఎన్నికల సమయంలో… ఎన్డీఏ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీ…56 ఇంచ్‌ల ఛాతితో నిలబడ్డారు. సోషల్ మీడియా ఆయనను దేశానికి ఓ సేవియర్‌గా ప్రచారం చేసింది. దాని ఫలితమే బీజేపీకి ఏకపక్ష విజయం తప్ప.. బీజేపీ విధానాలకు మెచ్చి కాదు. నాలుగేళ్లలో మోదీ .. పదేళ్ల కాంగ్రెస్ హయాం తెచ్చుకోనంత వ్యతిరేకత తెచ్చుకున్నారు. దేశంలో ఓ భాగం మొత్తాన్ని తనకు వ్యతిరేకం చేసుకున్నారు. హైప్ వచ్చినప్పుడు వచ్చిన ఫలితాల్ని చూసి విర్రవీగారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
అందుకే రాహుల్ గాంధీ కర్ణాటక ఎన్నికల ప్రచారంలో నేరుగా కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధిస్తే.. తానే ప్రధానమంత్రినని ప్రకటించేశారు. ఈ ఎఫెక్ట్ కోసమే ఎదురు చూస్తున్న కాంగ్రెస్ నేతలు.. సంతోషపడ్డారు. గతంలో రాహుల్ ఈ ప్రకటన చేసి ఉంటే వెంటనే రాహుల్ సామర్థ్యాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు చేసేవాళ్లు. ఇప్పుడు రాహుల్ ఇమేజ్.. మోదీతో పోటీపడే స్థాయికి చేరింది. దీన్ని సరైన సమయంలో.. అందరి ముందూ పెట్టారు రాహుల్ గాంధీ. అధికారక వ్యతిరేకతను అధిగమించి మరీ.. కర్ణాటకలో అధికారాన్ని నిలబెట్టుకోబోతున్న ధైర్యం రాహుల్‌లో కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా అదీ కూడా ఉత్తరాదిలో కలసి వస్తున్న సమీకరణాలు… రాహుల్ కాన్ఫిడెన్స్ కు మరో కారణం. గత ఎన్నికల్లో హిందీ బెల్ట్ లో బీజేపీ అసాధారణ విజయాలు నమోదు చేసింది. ఈ సారి అందులో సగం కూడా గ్యారంటీ లేదు. కొన్ని చోట్ల బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి కాకపోయినా… కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉన్న పార్టీలే… బీజేపీని పడగొట్టబోతున్నాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తానే ప్రధానమంత్రినన్న ప్రకటనలోనూ.. రాహుల్ చాణక్యం చూపించారు. పూర్తి మెజార్టీ వస్తే అన్న వాక్యాన్ని కలిపి… రాహుల్ స్టేట్మెంట్ ఇవ్వడంతో… ఇప్పటికే ఉన్న మిత్రపక్షాలు.. దగ్గరకు చేరే అవకాశం ఉన్న మిత్రపక్షాల అభిప్రాయాలకు ఇందులో చోటు కల్పించే అవకాశం లేకుండా చేశారు. కాంగ్రెస్ పార్టీ వచ్చే సాధారణ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించినా… కలసి వచ్చే పార్టీలు రాహుల్ ను ప్రధానిగా అంగీకరిస్తాయన్న గ్యారంటీ ఉండదు. ఏ పార్టీ అజెండా వారికి ఉంటుంది. ఆ విషయంలో వారిని కదిలించండ తొందరపాటు అవుతుందని రాహుల్ గ్రహించారు. కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ వస్తే… మరో అభిప్రాయానికి చాన్స్ ఉండదు. మొత్తానికి రాహుల్ కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్థిగా ఆమోదం పొందారు.