కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మళ్ళీ ఇవ్వాళ్ళ లోక్ సభలో నిద్రలోకి జారుకొన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గే, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ల మధ్య తీవ్ర స్థాయిలో వాదోపవాదాలు జరుగుతున్నాయి. గుజరాత్ లో కొన్ని వారాల క్రితం ఇద్దరు దళిత యువకుల పట్ల కొందరు అనుచితంగా వ్యవహరించారు. దానిపై అప్పుడే గుజరాత్ ప్రభుత్వంపై, మోడీపై చాలా విమర్శలు వచ్చాయి. ఇవ్వాళ్ళ లోక్ సభ సమావేశం మొదలవగానే ఆ అంశం మీద సభలో చర్చ జరగాలని పట్టుబడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చాలా రభస చేశారు. ఆ అంశంతో మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టిగా ప్రయత్నిస్తుంటే, దానిపై ఏమాత్రం ఆసక్తిలేని రాహుల్ గాంధీ మెల్లగా నిద్రలోకి జారుకొన్నారు.
పార్లమెంటు, శాసనసభ, బహిరంగ సభలు, సమావేశాలలో రాజకీయ నేతలు, మంత్రులు, ప్రజా ప్రతినిధులు చిన్నగా కునుకు తీయడం సర్వసాధారణమైన విషయమే కానీ కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పుకొనే రాహుల్ గాంధీ కూడా సభలో ఈవిధంగా కునుకు తీస్తుండటం, అది మీడియా కంటపడటం కాంగ్రెస్ సభ్యులకి, నేతలకి దాని అధిష్టానానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక రాహుల్ గాంధీ సభలో నిద్రపోకుండా ఉండాలంటే ఏమి చేయాలి? అనే దానిపై సభలో చర్చ జరిగితే ఎవరైనా మంచి సలహా చెపుతారేమో? అప్పుడైనా ఆయన సభలో నిద్ర ఆపుకోగలరో లేదో?