ఆంధ్రప్రదేశ్ లో సీట్ల సర్దుబాటు విషయంలో తెలుగుదేశంపార్టీ వెనుకడుగు వేస్తున్నా… జాతీయ స్థాయిలో మాత్రమే సహకరిస్తామని… ఏపీలో పొత్తు పెట్టుకోలేమని సంకేతాలు పంపుతున్నా…కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం…ఎక్కడ తెలుగువారు కనిపించినా.. అధికారంలోకి వస్తే మొదటి సంతకం ప్రత్యేకహోదాపైనే పెడతామని హామీ ఇస్తున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం దుబాయ్లో ఉన్న రాహుల్.. అక్కడ పని చేస్తున్న భారతీయ కార్మికులను కలిశారు. అక్కడ తెలుగు కార్మికులు ఎక్కువగా ఉండటంతో వారికి మరోసారి హామీ ఇచ్చారు. రాష్ట్రం విడిపోయాక ఏపీకి కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని మరిచారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా కలిసి భారత ప్రభుత్వానికి, మోదీకి అర్థమయ్యేలా చెప్పాలని పిలుపునిచ్చారు.
రాహుల్ గాంధీ… విదేశీ పర్యటనల్లో కాదు.. ఇండియాలో.. తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న చోట్ల .. ప్రసంగించాల్సి వచ్చినా.. ప్రత్యేకహోదా హామీ గురించి పదే పదే ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో.. ఒకే ఒక్క సభలో ప్రసంగించిన సోనియా గాంధీ కూడా ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు.ఈ విషయాన్ని టీఆర్ఎస్ నేతలు వివాదాస్పదం చేశారు. తెలంగాణ గడ్డపై.. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించి అవమానించారని విమర్శించారు. అయినా రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు. గతంలో ఫ్రాన్స్, అమెరికా పర్యటనల్లోనూ ప్రవాస భారతీయుల్ని ఉద్దేశంచి ప్రసంగించిన సమయంలోనూ ప్రత్యేకహోదా హామీ గురించి ప్రస్తావించారు.
ప్రత్యేకహోదా ఏపీ రాజకీయాల్లో కీలకమైన అంశంగా మారింది. అయితే.. ప్రత్యేకహోదా హామీ ఇచ్చి.. కాంగ్రెస్ బరిలోకి దిగినా.. ప్రయోజనం ఉండే పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో టీడీపీని మిత్రపక్షంగా ఉంచుకోవడానికి మాత్రం ఈ హామీ ఉపయోగపడుతోంది. ఓ వైపు.. ఏపీలో తమకు ఓట్లు సీట్లు ఏమీ లేవని.. నిధుల విడుదల పట్ల బీజేపీ నిర్లక్ష్యం చూపుతోంది. కానీ.. తమది అదే పరిస్థితి అయినా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాత్రం.. ఏపీ ప్రత్యేకహోదా అంశాన్ని మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారని.. ఆయన ప్రకటనల ద్వారానే తెలుస్తోంది.