కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలో ఆయన మాట్లాడారు. ఆశావాద దృక్పథంతో 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చానని రాహుల్ చెప్పాను. దేశంలో ఎన్నో ప్రాంతాలు తిరిగాననీ, ఎంతోమందిని కలుసుకున్నానని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో కాంగ్రెస్ పట్ల ఒక ఆశావాద దృక్పథం ఉందన్నారు. ప్రజలను అన్ని విధాలుగా పైకి తీసుకుని రావడం రాజకీయాల లక్ష్యమనీ, కానీ ఈరోజున ప్రజలను అన్ని రకాలుగా అణచివేసే రాజకీయాలు రాజ్యమేలుతున్నాయని భాజపాని విమర్శించారు. పేదలకు అండగా నిలిచేందుకు సిద్ధమైన తక్షణమే అన్ని రకాలుగా దాడులు చేసే ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. పేదల్ని మరింత పేదలుగా చేయడమే నేటి పాలకుల లక్ష్యమన్నారు.
దేశాన్ని 20వ శాతాబ్దానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే.. దాన్ని మధ్య యుగం నాటికి నేటి ప్రధాని వెనక్కి లాక్కెళ్లారని విమర్శించారు. ప్రేమలు లేని, బాధ్యతలు లేని, ఒకరినొకరు చంపుకుని తినే నాటి యుగంలోకి దేశాన్ని తీసుకెళ్లారన్నారు. ఒక మనిషి బలంగా కనిపించడం కోసం, చుట్టూ ఉన్న అన్నింటికీ బలహీన పరుస్తున్నారంటూ ప్రధాని మోడీని ఉద్దేశించి విమర్శించారు. ‘గడచిన రెండేళ్లుగా అర్థమైంది ఏంటంటే… కాంగ్రెస్ పార్టీపై దాడులు పెంచడం ద్వారా మనల్ని అణచివేసే ప్రయత్నం జరుగుతోంది’ అని కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ చెప్పారు. ‘మనపై వారు ప్రదర్శించే కోపం, పగ.. ఇవే మనల్ని మరింత శక్తిమంతంగా చేస్తున్నాయ’న్నారు. ‘మనల్ని తాత్కాలికంగా ఓడించగలరేమోగానీ, శాశ్వతంగా వెనక్కి నెట్టేయడం వారికి సాధ్యం కాని పని’ అని రాహుల్ అభిప్రాయపడ్డారు.
వారు దేశంలో నిప్పు పెట్టారనీ, దాన్ని ఆపగలిగే శక్తి కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని భాజపాని ఉద్దేశించి రాహుల్ అన్నారు. వాళ్లు విడగొట్టేందుకు చూస్తున్నారనీ, మనం కలిపేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. వాళ్లు ద్వేషంతో వ్యవహరిస్తే, మనం ప్రేమ పంచుదామన్నారు. యువతను ఆహ్వానిస్తున్నాననీ, ఇకపై దేశ యువత ఆలోచనలకు కాంగ్రెస్ అద్దం పడుతుందనీ, దేశంలోనే గ్రాండ్ ఓల్డ్ అండ్ యంగ్ పార్టీగా కాంగ్రెస్ నిలుస్తుందని రాహుల్ పిలుపునిచ్చారు. తమది పాత పార్టీ అని కొంతమంది విమర్శలు చేస్తుంటారనీ, కానీ దేశానికి స్వతంత్రం సాధించిన స్ఫూర్తి, అహింసా మార్గంలో నడిచిన ఖ్యాతి ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ రక్తంలో ఉందన్నారు. కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా కాంగ్రెస్ సామాన్యుడి గొంతు కావాలని ఆకాంక్షించారు.
అధ్యక్షుడి హోదాలో రాహుల్ తొలి ఉపన్యాసం ఇలా సాగింది. తాత్కాలిక ఓటములను అంగీకరిస్తూనే… దీర్ఘకాలిక పోరాటానికి తాను సిద్ధమనే సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇకపై కాంగ్రెస్ పార్టీ యువతకు ప్రాధాన్యత పెంచుతూనే అనుభవానికీ అగ్రతాంబూలం ఉంటుందని చెప్పారు. వ్యక్తిగతంగా మోడీపై చేసే రొటీన్ మాటల దాడిని తగ్గించి… వ్యవస్థీకృతంగా నాశనమౌతున్న దేశానికి కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయం అని చూపే విధంగా రాహుల్ మాట్లాడారు.