బీహార్లో కొంతైనా బలం పెంచుకోవాలని ఆరాటపడుతున్న కాంగ్రెస్ నావను ఒడ్డెక్కించడానికి యువ నేత రాహుల్ గాంధీ సర్వశక్తులూ ఒడ్డటానికి రంగం సిద్ధం చేసుకున్నారు. చంపారన్ సభతో తన మహా ప్రయత్నాన్ని మొదలుపెట్టారు. రాహుల్ ప్రసంగాలు రాసేది ఎవరో గానీ పాత స్క్రిప్టునే ఆయన చేతిలో పెడుతున్నట్టున్నారు. కొత్త విషయాలను ఆయన కూడా చెప్పి రాయించుకోవడం లేదేమో. చంపారన్ సభలోనూ సూటూ బూటూ మాటల మీదే ఫోకస్ చేశారు. ఆ మాటను గతంలో చంపారన్ లో అనకపోయినా, చాలా సార్లు టీవీలో వినే ఉంటారు. మరో విషయం, రాహుల్ ప్రసంగ శైలి ఏమాత్రం రాటుదేలలేదు. ఉపన్యాసం ఇవ్వడంతో పాటు పదాలను సందర్భోచితంగా నొక్కి పలకడం, ప్రజల్లో ఆసక్తి కలిగించేలా మాట్లాడటం, హావభావాల్లో పరిణతి చూపించడం వంటివి రాహుల్ ఇంకా నేర్చుకున్నట్టు లేదు.
ఆంగ్లంలో చెప్పాలంటే క్యాజువల్ గా కనిపిస్తుంది రాహుల్ ప్రసంగం. ఇందిర నుంచి మోడీ దాకా ప్రసంగాల వీడియోలను ఓ సారి చూస్తే అర్థమవుతుంది. అలా రాహుల్ కూడా తనకంటూ ఓ శైలిని ఖాయం చేసుకోవాలి. అంతెందుకు, లాలు, నితీష్ కుమార్ లకు కూడా తమకవంటూ ఓ శైలి ఉంది. వారి ప్రసంగాలను బీహారీలు ఆసక్తిగా వింటారు. తల్లి సోనియా గాంధీకి ఇప్పటికీ హిందీలోగానీ ఇంగ్లీషులో గానీ ప్రసంగించడం రాదు. సరే, ఇప్పుడు పార్టీని నడపాల్సింది రాహుల్ గాంధీ. ముందు బీహార్లో మరికొన్ని సభల్లో ప్రసంగించాల్సి ఉంది. అక్కడా ఇలాగే మాట్లాడితే ప్రజలను ప్రభావితం చేసే అవకాశం లేదు.
రాహుల్ గాంధీని ఎవరూ గల్లీ లీడర్ తో పోల్చి చూడరు. కాంగ్రెస్ కాబోయే అధ్యక్షుడు కాబట్టి ప్రధాని మోడీతో పోల్చి చూడాలంటారు పరిశీలకులు. అలా చూస్తే రాహుల్ తేలిపోతారు. బీహార్లో నువ్వానేనా అన్నట్టు పోటీ పడాలని అనుకున్నప్పుడు ప్రసంగ శైలిని మార్చుకుంటారా లేక సాదాసీదా ప్రసంగాలతో తన పార్టీకి ఏమాత్రం ఉపయోపడకుండా తిరుగు ప్రయాణమవుతారా అనేది వేచి చూడాలి.